Godavari Flood Impact: డిసెంబరు నాటికి డయాఫ్రమ్‌వాల్ పూర్తయ్యేనా
ABN , Publish Date - May 25 , 2025 | 04:40 AM
డిసెంబరు నాటికి డయాఫ్రమ్‌వాల్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంపై భారీ వర్షాలు అడ్డంకిగా మారాయి. వర్షాలు మరియు వరదల కారణంగా పనుల వేగం తగ్గి లక్ష్యం మిస్ అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులు బెంబేలు
అమరావతి, మే 24 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది డిసెంబరు నాటికి డయాఫ్రమ్‌వాల్ పనులు పూర్తి చేయాలన్న రాష్ట్ర జల వనరుల శాఖ ఆశలపై వరుణుడు నీళ్లు కుమ్మరిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 18న డయాఫ్రమ్‌వాల్ నిర్మాణ పనులను బావర్ కంపెనీ మొదలపెట్టింది. లక్ష్యాన్ని అందుకునేందుకువీలుగా మూడు కట్టర్లను ఉపయోగించి పనులు చేపడుతోంది. మే నెలంతా వర్షాలు కురుస్తుండటంతో పనుల వేగం తగ్గుతోందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది అంతానికి వాల్ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని అందుకోలేని పరిస్థితి నెలకొంది. జూన్, జూలై, ఆగస్టుల్లో గోదావరికి వరద ఉధృతి తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎగువ నుంచి సగటున 14 లక్షల క్యూసెక్కుల నుంచి 18లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉంటుంది. ఇంత భారీ వరద ప్రవాహం ఉన్నప్పుడు నిర్మాణ పనులు సాధ్యం కావన్న అభిప్రాయం వ్యక్తవుతోంది. నిర్మాణ లక్ష్యంలో 4నెలలు వర్షాలు, వరదల కారణంగా కోల్పోతే డయాఫ్రమ్‌వాల్‌తోపాటు, ఒకవైపు నుంచి సమాంతరంగా సాగుతున్న ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణ పనులూ కుంటుపడే అవకాశం ఉంటుందని జల వనరుల శాఖ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌కు సంబంధించి గ్యాప్-1 పనుల డిజైన్లకు కేంద్ర జల సంఘం ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆ పనులు కూడా చేపడుతున్నారు. గ్యాప్-2 డిజైన్లపైనా చర్చలప్రక్రియ షురూ అయింది. ఈ డిజైన్లనూ కేంద్ర జలసంఘం ఆమోదిస్తే గ్యాప్-3 ప్రాంతంలోనూ పనులు ప్రారంభించాలని భావిస్తోంది. స్థిరమైన లక్ష్యాలను వేసుకుని, యంత్ర సామగ్రిని సిద్ధం చేసుకుని పనులు చేస్తున్నా, వర్షాలతో జల వనరుల శాఖలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో కురుస్తున్న వానలకు తోడు..ఎగువ నుంచి భారీగా వరద ఎగదన్నుకొస్తే ఈ ఏడాది అంతానికి లక్ష్యాలను చేరుకోవడం కష్టమేనని జల వనరుల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.