Hero Nagarjuna: హీరో అక్కినేని నాగార్జునకు ఢిల్లీ హైకోర్టు అండ
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:17 AM
సినీ నటుడు నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని..
ఢిల్లీ, అక్టోబర్ 1: సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు.. నాగార్జున నుంచి ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.
దీంతో ప్రస్తుత డిజిటల్ యుగంలో హీరో నాగార్జున గుర్తింపు హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) రక్షణ లభించినట్లైంది. సాంకేతికతలతో మోసపూరిత కంటెంట్‌లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. ఈ తీర్పు సెలబ్రిటీల గుర్తింపు హక్కులను రక్షించడంలో ఒక మైల్ స్టోన్ తీర్పుగా నిలిచింది.
జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలో జరిగిన ఈ కేసు విచారణలో, నాగార్జున తరపున సీనియర్ అడ్వకేట్ ప్రవీణ్ ఆనంద్, వైభవ్ గాగ్గర్, వైశాలి మిత్తల్ వాదించారు. నాగార్జున 95 సినిమాలు చేసి, రెండు జాతీయ పురస్కారాలు పొందిన గొప్ప నటుడని 'సెల్యులాయిడ్ సైంటిస్ట్'గా పిలవబడతారని, ఆయనకు ఎక్స్ (ట్విట్టర్)లో 60 లక్షలు, ఫేస్‌బుక్‌లో 81 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని వారు కోర్టుకు తెలిపారు.
నాగార్జున గుర్తింపు ఆధారంగా పోర్న్ కంటెంట్, ఫేక్ ఎండోర్స్‌మెంట్స్, టీ-షర్ట్‌లు, మెర్చండైజ్ వంటివి అమ్ముతున్నారని, యూట్యూబ్ షార్ట్స్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించి మోసపూరిత వీడియోలు వైరల్ చేస్తున్నారని లాయర్లు కోర్టుకు విన్నవించారు. ఇటువంటి కంటెంట్‌ను ఏఐ మోడల్స్ ట్రైనింగ్‌కు ఉపయోగిస్తే మరింత హాని వాటిల్లుతుందని కోర్టులో వాదించారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించి పై ఆదేశాలు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం