నాకేమైనా అయితే వివేకా కేసు నిర్వీర్యమే!
ABN , Publish Date - Mar 13 , 2025 | 03:42 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తానే కీలక సాక్షినని.. తనకేమైనా జరిగితే కేసు నిర్వీర్యమైపోతుందని అప్రూవర్‌గా మారిన దస్తగిరి హెచ్చరించారు. అందుచేత తనకు భద్రత పెంచాలని కోరారు.

ఆ హత్య కేసులో కీలక సాక్షిని.. భద్రత పెంచాలి:దస్తగిరి
2+2+ఎస్కార్ట్ వాహనం ఉండేది.. కూటమి ప్రభుత్వం కుదించింది
వైసీపీ నేతలు, కార్యకర్తల నుంచి నాకు ప్రమాదం పొంచి ఉంది
సాక్షుల మరణాలు సహజమో, హత్యలో నిగ్గుతేల్చాలి
‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’తో దస్తగిరి.. రక్షణ కోసం కడప ఎస్పీకి వినతి
కడప, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తానే కీలక సాక్షినని.. తనకేమైనా జరిగితే కేసు నిర్వీర్యమైపోతుందని అప్రూవర్‌గా మారిన దస్తగిరి హెచ్చరించారు. అందుచేత తనకు భద్రత పెంచాలని కోరారు. మంగళవారం ఆయన ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. గతంలో తనకు 2+2+ఎస్కార్ట్ వెహికల్ ఉండేదని, కూటమి అధికారంలోకి వచ్చాక 1+1కు కుదించారని తెలిపారు. ‘పులివెందులలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు.. వైఎస్ కుటుంబానికి కట్టుబానిసల లెక్కన పనిచేస్తారు. వారి నుంచి ప్రమాదం పొంచి ఉందని నేను అప్రూవర్‌గా మారినప్పటి నుంచీ తెలుసు. అప్పటి సీబీఐ ఎస్పీకి తెలియజేయగా.. ఆయన కడప ఎస్పీతో మాట్లాడి భద్రత కల్పించారు. అయితే అయితే ఇప్పుడు తగ్గించారు. పెంచాలని కోరుతున్నా. వివేకా హత్య కేసులో సాక్షులుగా ఉన్న శ్రీనివాసులరెడ్డి దగ్గర నుంచి వాచ్‌మన్ రంగన్న వరకు జరిగిన మరణాలు సహజమా.. లేక హత్యలా అనేది వైసీపీనే చెప్పాలి. 2019లో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది. అప్పుడు ఒకరిమీద బురదజల్లాలని మాతో ఈ హత్య చేయించి.. చంద్రబాబు చేయించాడని జగన్ చెప్పారు. తర్వాత జగన్ సీబీఐ ఎంక్వైరీ కావాలని కోరారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కోర్టులో పిటిషన్ విత్‌డ్రా చేసుకున్నారు. సీబీఐ వద్దకు వెళ్లకుండా ఇష్టానుసారంగా సాక్షులను భయభ్రాంతులకు గురిచేశారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో, ఆ తర్వాత పలువురు సాక్షులు చనిపోయారు. అవి హత్యలా, అనుమానాస్పద మరణాలా అనేది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తేల్చే పనిలో ఉంది. దానిపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది’ అని చెప్పారు. 2019లో జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి తప్పు చేసి చంద్రబాబుపై బురదజల్లారని.. తాను అప్రూవర్‌గా మారడంతో ఐదేళ్లలో ఎన్నో కేసులు పెట్టించి, ఇబ్బందులు పెట్టి దెబ్బతీయాలని, లొంగదీసుకోవాలని చూశారని.. ఎన్ని సమస్యలొచ్చినా ఎవరికీ భయపడలేదని దస్తగిరి తెలిపారు. ‘నేను తప్పు చేశాను. ప్రాయశ్చిత్తంగా అప్రూవర్‌గా మారాను. మళ్లీ వీళ్లతో కలిసి తప్పుచేయాలనే ఆలోచన లేదు. అప్పటి నుంచి ఎన్నో విధాలుగా నాతో సంప్రదింపులు జరిపారు. లైఫ్ సెటిల్‌మెంట్ చేస్తామని చెప్పారు. ఆ విషయాలన్నీ సీబీఐకి చెప్పాను. శ్రీనివాసులరెడ్డి ఏ విధంగా లెటర్ రాసి చనిపోయాడు? కువైట్ గంగాధర్ ఎలుకలు కొరికి చనిపోయాడని కథనాలు నడిపారు.. ఒకరిద్దరి తర్వాత ఇప్పుడు రంగన్న చనిపోయాడు. రంగన్న మరణం వెనుక ఎవరున్నారో తేలాలని పులివెందుల ఏరియా అంతా అనుకుంటోంది. ఈ హత్య కేసు విషయంలో ఎంతో మంది అమాయకులు బలయ్యారు. తప్పు చేసిందొకడు, చేయించిందొకడు. నిజానిజాలు నిగ్గుతేల్చాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, ప్రధాని మోదీలను కోరుతున్నా’ అని చెప్పారు. జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మరణంపై మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏదీ బయటకు రానివ్వరని, గోప్యత పాటిస్తారని అన్నారు. అనంతరం దస్తగిరి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి భద్రత పెంచాలంటూ వినతిపత్రం సమర్పించారు.