DGP Harish Kumar Gupta: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:40 AM
సైబర్ నేరగాళ్లు రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ ద్వారా వచ్చే నకిలీ ఏపీకే ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవద్దు అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు.
వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్‌లోడ్ చేయద్దు
మోసాలపై 1930కి ఫిర్యాదు చేయండి: డీజీపీ గుప్తా
అమరావతి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ‘సైబర్ నేరగాళ్లు రైతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ ద్వారా వచ్చే నకిలీ ఏపీకే ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవద్దు’ అని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. ఇటీవల సత్యసాయి జిల్లా కనగానిపల్లికి చెందిన ఒక రైతుకు పీఎం కిసాన్ యోజన పేరుతో ఒక ఫేక్ ఏపీకే ఫైలు వాట్సాప్ ద్వారా వచ్చింది. దాన్ని అధికారిక యాప్‌గా భావించిన రైతు డౌన్‌లోడ్ చేయడంతో ఆయన ఖాతాలో ఉన్న రూ.94 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఇలాంటివి దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని తేలడంతో రాష్ట్ర పోలీసు శాఖలోని సైబర్ విభాగాన్ని డీజీపీ అప్రమత్తం చేశారు. మరో వైపు ప్రజల్ని అప్రమత్తం చేసిన ఆయన... గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్లే ప్రొటెక్ట్ సదుపాయాన్ని ఆన్ చేసుకోవాలని.. అవాస్త్, నార్టన్, బిట్ డిఫెండర్ లాంటి యాంటీ వైరస్ యాప్‌లను ఉపయోగించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లు క్లిక్ చేస్తే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్‌తో ఎవరైనా వారి బారిన పడితే తక్షణమే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. రాష్ట్రంలో సైబర్ మోసాలు, ఆర్థిక నేరాలు అరికట్టేందుకు జిల్లాకొక సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు.