CPI Narayana: రాఘవాచారి సంపాదకీయాల సంపుటి ఆవిష్కరణ
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:07 AM
రాజ్యాంగ వ్యవస్థను కొంతమంది తమ గుప్పెట్లో పెట్టుకుని దేశాన్ని ఫాసిస్టు శైలిలో పాలిస్తున్నారని సీపీఐ నేత కె. నారాయణ అన్నారు. విజయవాడలో రాఘవాచారి సంపాదకీయాల నాలుగో సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు
విజయవాడ(మొగల్రాజపురం), ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): దేశంలో రాజ్యాంగ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని పరిపాలన చేస్తున్నారని, దీనివల్ల మళ్లీ వేర్పాటు వాదం మొదలవుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ చెప్పారు. విశాలాంధ్ర పూర్వ సంపాదకులు సి.రాఘవాచారి సంపాదకీయాల నాలుగో సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం శనివారం మొగల్రాజపురం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. నారాయణ మాట్లాడుతూ ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఉత్తర, దక్షిణ భారతంగా విడిపోవడానికి ప్రస్తుత ఫాసిస్టు పాలన దోహదం చేస్తుందని వ్యాఖ్యానించారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, రాఘవాచారి ట్రస్టు సభ్యుడు ప్రొఫెసర్ బుడ్జిగ జమిందార్, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, సి.రాఘవాచారి భార్య జోత్స్న, కుమార్తె డాక్టర్ అనుపమ తదతరులు పాల్గొన్నారు.