Alipiri Tirumala Route: భక్తుల రక్షణకు చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:32 AM
తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గంలో భక్తుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది..
అలిపిరి- తిరుమల నడక మార్గంలో జేఏసీ సిఫారసులు అమలు చేయండి
టీటీడీకి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): తిరుపతి అలిపిరి నుంచి తిరుమల వరకు నడక మార్గంలో భక్తుల రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై జేఏసీ సిఫారసులను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేసింది. భక్తుల రక్షణ అంశంపై వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్, టీటీడీ, అటవీశాఖ అధికారుల జేఏసీ సమర్పించిన నివేదికలో పలు సిఫారసులు చేసిందని గుర్తు చేసింది. చిరుత దాడిలో చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులకు మరో రూ.15 లక్షల పరిహారం అందజేసే విషయాన్ని పరిశీలించాలని టీటీడీకి సూచించింది. తదుపరి విచారణను డిసెంబరు 24కి వాయిదా వేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. వన్యప్రాణుల నుంచి భక్తులను రక్షించేందుకు కాలినడక మార్గంలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం, టీటీడీ, అటవీశాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి 2023లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా పిటిషనర్ తరఫు న్యాయవాది రేగులగడ్డ వెంకటేశ్ స్పందిస్తూ... నడక మార్గంలో భక్తుల రక్షణపై జేఏసీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. కమిటీ నివేదికలోని స్వల్పకాలిక సిఫారసులను అమలు చేశామని టీటీడీ తరఫు న్యాయవాది చెప్పారు. కమిటీ సూచనలు, సిఫారసులను తూచా తప్పకుండా అమలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.