Share News

Fire Attack: ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్‌ పోసి నిప్పు

ABN , Publish Date - Jul 17 , 2025 | 05:09 AM

ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

Fire Attack: ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్‌ పోసి నిప్పు

  • భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం.. పల్నాడు జిల్లా ఐనవోలులో దారుణం

నూజెండ్ల, జూలై 16(ఆంధ్రజ్యోతి): ఆరు బయట నిద్రిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. భార్య ప్రాణాలు కోల్పోగా, భర్త తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో బుధవారం వేకువజామున జరిగిందీ దారుణం. బాధితుల కుటుంబసభ్యుల కథనం మేరకు.. వ్యవసాయ పనులతో జీవనం సాగించే నీలబోయిన పెద శ్రీను, మంగమ్మ (50) దంపతులు ఇంటి మరమ్మతుల దృష్ట్యా గ్రామ సమీపంలో పాకలో నివసిస్తున్నారు. మరమ్మతులు పూర్తవడంతో బుధవారం సొంతింట్లోకి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం రాత్రి పాక వద్దే నిద్రించారు. వేకువజామున 2:30 గంటలకు మంటలు గమనించామని వారి కుమారుడు బ్రహ్మయ్య పోలీసులకు తెలిపారు. తండ్రి మంటల్లో కాలిపోతుండగా తానే ఆర్పి వేశానని, తల్లి పక్కనే ఉన్న నీటి ట్యాంక్‌ వద్దకు వెళ్లి మంటల్ని ఆర్పి వేసుకుందని చెప్పారు. ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మంగమ్మ మరణించారు. పెద శ్రీను పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ కంచి శ్రీనివాసరావు పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ నమూనాలు సేకరించింది.

Updated Date - Jul 17 , 2025 | 05:09 AM