Share News

Corruption Allegations: అదే ఉద్యోగి.. అదే సీటు

ABN , Publish Date - May 31 , 2025 | 05:38 AM

దేవదాయ శాఖలో అవినీతి ఆరోపణలున్న ఉద్యోగిని కీలక ఈ-2 విభాగంలో బదిలీ చేయడంతో చర్చలు సాగుతున్నాయి. గతంలో కోట్లు వసూలు చేసినట్లు నిరూపితమైన ఉద్యోగికి మళ్లీ సీటు అప్పగించడంపై ప్రజల్లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Corruption Allegations: అదే ఉద్యోగి.. అదే సీటు

దేవదాయ శాఖలో అంతర్గత బది‘లీలలు’

అవినీతి ఆరోపణలున్న ఉద్యోగికి కీలక విభాగం కేటాయింపు

అమరావతి. మే 30(ఆంధ్రజ్యోతి): దేవదాయ శాఖ ప్రధాన కార్యాలయం లో అంతర్గత బదిలీల్లో భాగంగా శుక్రవారం ఇద్దరు ఉద్యోగులను కమిషనర్‌ సీటు మార్చారు. ఈ-సెక్షన్‌లో కొన్ని విభాగాలను సీ-సెక్షన్‌ బాధ్యతలు నిర్వహించే సీనియర్‌ అసిస్టెంట్‌కు అప్పగించారు. గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, గ్రేడ్‌-3 ఈవోల సర్వీస్‌ మెంటర్లు, వారి బదిలీలన్నీ ఈ-సెక్షన్‌లోని ఈ-2 విభాగంలోనే ఉంటాయి. అంత కీలకమైన విభాగానికి సంబంధించిన ఉద్యోగిని ఆకస్మాత్తుగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ-2 సీటు అప్పగించిన ఉద్యోగిపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. గతంలో ఇదే సీటులో విధులు నిర్వహించిన ఆయన ఈవోల బదిలీల పేరుతో రూ.కోట్లు వసూలు చేశారు. దీనిపై గత ప్రభుత్వంలో దేవదాయ మంత్రికి ఫిర్యాదులు అందడంతో నిఘా విభాగంతో విచారణ చేయించారు. బదిలీల పేరుతో రూ.కోట్లు వసూలు చేయడం వాస్తవమేనంటూ అందుకు బాధ్యులైన అధికారులు, ఉద్యోగుల వివరాలతో సహా ఇంటెలిజెన్స్‌ అధికారులు నివేదిక అందించారు. స్పందించిన నాటి ప్రభుత్వం వెంటనే సదరు ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. కానీ అప్పటి దేవదాయ శాఖ అధికారులు కేవలం సెక్షన్‌, సీటు మార్చడంతో సరిపెట్టారు. ఇప్పుడు సాధారణ బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగికి మళ్లీ కీలకమైన ఈ-2 విభాగం బాధ్యతలు అప్పగించడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతర్గత బదిలీ పేరుతో దేవదాయ శాఖ అధికారులు ఆకస్మాత్తుగా సీటు మార్చడంతో మరోసారి భారీగా వసూళ్లకు సిద్ధమయ్యారేమోనని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ‘బెటర్‌ ఆడ్మినిస్ట్రేషన్‌’ కోసం అంతర్గత బదిలీలు చేస్తున్నట్లు అధికారులు ఇచ్చిన ఉత్తర్వులో పేర్కొన్నారు. దీని ప్రకారం సమర్థులైన ఉద్యోగులకు ఇలాంటి కీలక విభాగాన్ని కేటాయించాలి. కానీ అవినీతి ఆరోపణలున్న ఉద్యోగులకు ఆ సీటు అప్పగించడం సరికాదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 05:39 AM