Visakhapatnam: దేవదాయ శాఖ ఏసీ శాంతిపై విచారణ
ABN , Publish Date - Mar 05 , 2025 | 05:23 AM
వివాదాస్పద అధికారిణిగా ముద్రపడిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కాళింగిరి శాంతి మంగళవారం విశాఖపట్నంలో విచారణకు హాజరయ్యారు.

ఆరోపణలను తోసిపుచ్చిన అధికారిణి
విశాఖపట్నం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): వివాదాస్పద అధికారిణిగా ముద్రపడిన దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) కాళింగిరి శాంతి మంగళవారం విశాఖపట్నంలో విచారణకు హాజరయ్యారు. ఆమె ఇక్కడ ఏసీగా పనిచేసినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యం లో ఆమెను సస్పెండ్ చేసిన ప్రభుత్వం.. విచారణకు ఆదేశించింది. విశాఖలోని కనకమహాలక్ష్మి దేవస్థానం ఈవో శో భారాణిని విచారణాధికారిగా నియమించారు. ఈ క్రమం లో శాంతి విచారణకు హాజరయ్యారు. ఆమెపై ఎక్కడెక్కడ ఆరోపణలు ఉన్నాయో(విశాఖపట్నం, అనకాపల్లి, కృష్ణా జిల్లా) ఆయా జిల్లాల అధికారులను కూడా రప్పించారు. కాగా, విచారణ సందర్భంగా శాంతి తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ తోసి పుచ్చారు. తాను ఎలాంటి తప్పులూ చేయలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఫైళ్లను ఇస్తే.. వాటిని పరిశీలించి తగిన సమాధానం చెబుతానని తెలిపారు. తాను దేవదాయ శాఖ భూములు కాపాడానని, ఆదాయం పెంచానని చెప్పుకొన్నారు. విశాఖ లో ఏసీగా పనిచేసినప్పుడు శాంతి తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తన పరిధిలోలేని ఆలయాల వ్యవహారాల్లో తలదూర్చి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆమెకు వ్యతిరేకంగా ఉద్యోగులంతా ధర్నాలు చేశారు. నాడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఆమె అందరినీ బెదిరించి దారికి తెచ్చుకున్నారు. ఒకే సమయంలో మూడు పోస్టుల్లో పనిచేశారు. ఈ క్రమంలో ఆమె లంకెలపాలెంలో పరదేశమ్మ ఆలయానికి చెందిన భూమిని ఆక్రమించుకున్న వారికే లీజుకు ఇచ్చారు. అందుకు భారీగా ముడుపులు అందుకున్నారని ఆరోపణలున్నాయి. ఏసీ పోస్టుకు సరైన అర్హత లేకుండానే విధుల్లో చేరారనే ఆరోపణలు వచ్చాయి.