Jagananna Housing Scam: జగనన్న ఇళ్లు కట్టిస్తానని భారీ మోసం
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:31 AM
వైసీపీ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీల్లో మరో అక్రమం వెలుగు చూసింది. కాలనీల్లో ఇళ్లను నిర్మించి ఇస్తానని చెప్పి.
పేద లబ్ధిదారుల నుంచి సొమ్ము తీసుకునిపరారైన వైసీపీకి చెందిన కాంట్రాక్టర్
200 మంది నుంచి రూ.కోటి వసూలు
బాధితుల గగ్గోలు.. స్పందించిన లోకేశ్
కాంట్రాక్టర్‌ను పట్టుకున్న అధికారులు
దుగ్గిరాల, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో చేపట్టిన జగనన్న కాలనీల్లో మరో అక్రమం వెలుగు చూసింది. కాలనీల్లో ఇళ్లను నిర్మించి ఇస్తానని చెప్పి.. పేద లబ్ధిదారుల నుంచి సుమారు రూ.కోటికి పైగా తీసుకుని మోసం చేసిన వైసీపీ నేత, కాంట్రాక్టరును ఎట్టకేలకు అధికారులు ప్రజల ముందు నిలబెట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలంలోని పలు గ్రామాల్లో పేదలకు జగనన్న ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన రూ.లక్షా 80 వేలతోపాటు లబ్ధిదారులు కూడా కొంత మొత్తం వెచ్చించి సొంతగా ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన మోరంపూడి ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్ ప్రసన్న.. ఇళ్లు నిర్మించి ఇస్తానని పేదలను నమ్మించారు. 200 మందికి పైగా లబ్ధిదారుల నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేశారు. ఇలా మొత్తం రూ.కోటిపైగానే ఆయన పోగేసుకున్నారు. కానీ, ఇళ్ల నిర్మాణాలు మాత్రం పూర్తి చేయలేదు. పైగా లబ్ధిదారుల కంట పడకుండా పరారయ్యారు. దీంతో బాధిత లబ్ధిదారులు ఈ విషయాన్ని టీడీపీ నేతల ద్వారా మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిని తీవ్రంగా పరిగణించిన మంత్రి లోకేశ్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. పరారైన కాంట్రాక్టర్‌ను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నెల రోజులపాటు గాలించి కాంట్రాక్టర్ ప్రసన్న ఆచూకీ కనుగొన్నారు. సోమవారం దుగ్గిరాల, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన లబ్ధిదారులను, స్థానిక పంచాయతీ కార్యాలయానికి పిలిపించారు. సుమారు 200 మందికిపైగా లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. తమ వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు కాంట్రాక్టర్ తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. తమకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, లేదా తీసుకున్న సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు వేడుకున్నారు. ఈ సందర్భంగా గృహనిర్మాణ శాఖ ఈఈ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ, తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కొందరు, తమ నగదు తిరిగి వెనక్కి ఇప్పించాలని మరికొందరు బాధిత లబ్ధిదారులు కోరినట్టు చెప్పారు. బాధితులు చాలా మందే ఉన్నారని, రెండు రోజులపాటు వారిని కూడా పిలిపించి మాట్లాడతామన్నారు. ‘‘కాంట్రాక్టర్ ఎవరి వద్ద ఎంత మొత్తం తీసుకున్నారు?. వారి ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చింది?. ఏవిధంగా వారికి న్యాయం చేయాలో తుది నిర్ణయం తీసుకుంటాం.’’ అని వివరించారు.
ఇదిలావుంటే, ఈమని గ్రామంలోనూ కొంతమందిని మరో కాంట్రాక్టర్ ఇదేవిధంగా మభ్యపెట్టి నగదు వసూలు చేసి పరారీలో ఉన్నట్లు అక్కడి వారు చెబుతున్నారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ ఏఈ సుబ్బారావు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News