AP elections: అరాచక పాలన అంతమై ఏడాది
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:44 AM
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి.. కూటమి పార్టీలు ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు ఆ జూన్ 4న వచ్చాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాయి.
రాష్ట్రవ్యాప్తంగా కూటమి కార్యక్రమాలు.. బాణసంచా కాల్చిన పార్టీల నేతలు
పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు
కర్నూలులో గొడ్డళ్లతో శ్రేణుల నిరసన
వివేకా హత్యను గుర్తు చేసిన కార్యకర్తలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
వైసీపీ ఐదేళ్ల నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతూ.. కూటమి పార్టీలకు చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన రోజు(జూన్ 4)ను పురస్కరించుకుని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీల నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి.. కూటమి పార్టీలు ఘన విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు ఆ జూన్ 4న వచ్చాయి. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని కూటమి పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు కేకులు కట్ చేసి ర్యాలీలు నిర్వహించారు. జగన్ ఐదేళ్ల అరాచక పాలన అంతమైన రోజేకాకుండా.. ఐదేళ్ల నిర్బంధానికి తెరపడిన రోజు ఇది అని టీడీపీ నాయకులు అన్నారు. ప్రజల తీర్పు వెలువడిన రోజును వెన్నుపోటు దినంగా వైసీపీ నిర్వహించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే జేసీ అశ్మిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యాడికి, విడపనకల్లు, అనంతపురం రూరల్, కనగానపల్లి, సీకే పల్లి, ఆత్మకూరు తదితర మండలాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, కదిరి, ధర్మవరం, పెనుకొండ, మడకశిరలో టీడీపీ శ్రేణులు పలు కార్యక్రమాలు నిర్వహించాయి. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తలుపుల మండలం పెద్దన్నవారిపల్లెలో ‘ఇంటింటికీ మన ఎమ్మెల్యే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
వెన్నుపోటుకు కేరాఫ్ జగనే
వెన్నుపోటుకు కేరాఫ్ జగన్‌రెడ్డేనని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత విమర్శించారు. కర్నూలు చెన్నమ్మకూడలిలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌తో కలిసి నిరసన వ్యక్తం చేశారు. కర్నూలులో టీడీపీ నేతలు గొడ్డళ్లను చేత పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డి, వివేకానందరెడ్డిల మాస్కులను ధరించారు. వివేకాను గొడ్డలితో నరుకుతున్న దృశ్యాన్ని ప్రదర్శించారు.
జనసేన విజయోత్సవం..
అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు, ఇంటింటా దీపాలు, బాణసంచా కాల్పులు, ఎడ్లబండిపై ఎమ్మెల్యే ఊరేగింపు నిర్వహించారు. రాజోల జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో విశ్వేశ్వరాయపురంలో సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు.
తిరుపతి జిల్లాలో..
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలలో నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టగా, టౌన్ క్లబ్ కూడలిలో మీడియా కో ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు నివాళులర్పించి కేక్ కట్ చేశారు. జనసేన ముగ్గుల పోటీలు నిర్వహించింది. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దంపతులు పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. చంద్రగిరి టవర్ క్లాక్ సెంటర్‌లో టీడీపీ శ్రేణులు కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చారు. ఎమ్మెల్యే పులివర్తి నానీ, డీసీఎంఎస్ చైర్మన్ పల్లినేని సుబ్రమణ్యం నాయుడు తదితరులతోపాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఎన్టీఆర్ కూడలిలో టీడీపీ కార్యకర్తలు కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. నాయుడుపేటలో సామాన్య టీడీపీ కార్యకర్త పేదలకు అన్నదానం చేశారు.
పార్వతీపురంలో..
పార్వతీపురం జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహించారు. కురపాం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పార్వతీపురంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు.
ఉమ్మడి కృష్ణాలో..
టీడీపీ శ్రేణులు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాయి. ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యాలయంలో లుక్కా సాయిరాం గౌడ్ నేతృత్వంలో కేకు కట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నేతృత్వంలో స్ధానిక టీడీపీ కార్యాలయం నుంచి విజయవాడ పశ్చిమ తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రౌడీషీటర్లను నగరం నుంచి బహిష్కరించినట్టు జగన్‌ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని బుద్దా వెంకన్న అన్నారు.
జనసేన నేతృత్వంలో..
జనసేన పిలుపు మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ‘సుపరిపాలన’ కార్యక్రమాలు జరిగాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని రామలింగేశ్వరనగర్‌లో సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు.
మంత్రి నాదెండ్ల మనోహర్‌తో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లు పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. ఏడాది కాలంలో అంకితభావంతో పవన్ కల్యాణ్ పనిచేశారని తెలిపారు. సీఎం చంద్రబాబు తన అనుభవంతో రాష్ర్టాన్ని ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. విజయవాడ ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ, మరో 30 ఏళ్లపాటు అధికారంలో ఉంటామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News