Share News

లిక్కర్‌ స్కామ్‌ కేసు ఈడీకి ఇవ్వాలి:సీఎం రమేశ్‌

ABN , Publish Date - May 25 , 2025 | 05:25 AM

ఏపీ లిక్కర్ స్కాం కేసును ఈడీకి ఇవ్వాలని సీఎం రమేశ్ డిమాండ్ చేశారు. జగన్ పాలనలో జరిగిన అవినీతులను కట్టడి చేయాలని, సిట్ దర్యాప్తు తగినంత కాలేదని పేర్కొన్నారు.

లిక్కర్‌ స్కామ్‌ కేసు ఈడీకి ఇవ్వాలి:సీఎం రమేశ్‌

న్యూఢిల్లీ, మే 24(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ ప్రభుత్వ హాయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంలోనే కాదు... ఇతర అవినీతి కుంభకోణాల్లోనూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జైలుకు వెళ్లడం ఖాయం’ అని రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ అన్నారు. శనివారం ఆయన తన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్‌ చాలా విషయాల్లో విచారణను వదిలేసింది. నన్ను పిలిస్తే సిట్‌కు చాలా విషయాలు చెప్పడానికి సిద్థంగా ఉన్నా. లిక్కర్‌ స్కాం దర్యాప్తునకు సిట్‌ సరిపోదు. ఈడీ, సీబీఐతో దర్యాప్తు చేయించాలి. ఢిల్లీ లిక్కర్‌ స్కాం రూ.200-300 కోట్లు అయితే ఏపీ లిక్కర్‌ స్కాంలో రూ.వేల కోట్ల దందా జరిగింది. సిట్‌ దర్యాప్తులో ఇంకా చాల విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. లిక్కర్‌ స్కామే కాకుండా జగన్‌ పాలనలో జరిగిన మైనింగ్‌, ఇసుక, భూదందాలనూ కూటమి ప్రభుత్వం వదలదు. మద్యం కుంభకోణానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఉన్నాయి. ఎవరూ తప్పించుకోలేరు. విదేశాలకు పారిపోయిన మద్యం కుంభకోణం నిందితులకు రెడ్‌ కార్నర్‌ నోటీసులు ఇచ్చి మరీ అరెస్టు చేస్తాం. మద్యం కుంభకోణంలో జగన్‌ పాత్రకు సంబంధించిన ఆధారాలు దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. విచారణ ఎదుర్కొనేందుకు జగన్‌ సిద్ధంగా ఉండాలి. అమరావతి అభివృద్ధితో తనకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని తెలుసుకున్న జగన్‌... అక్కసుతో రాజధానిపై విషం కక్కుతున్నారు. జగన్‌ తన కోసం రూ.540 కోట్లు పెట్టి విశాఖపట్నంలో రుషికొండపై ప్యాలెస్‌ కట్టుకున్నారు.


తాడేపల్లి, బెంగళూరు, హైదరాబాద్‌లో ప్యాలెస్‌లను కట్టుకున్నారు. ఏపీ ప్రజలకు మాత్రం రాజధాని వద్దా? అమరావతి రాజధాని నిర్మాణానికే కాకుండా జగన్‌ చాలా అడ్డంకులు సృష్టిస్తున్నారు. అమరావతి రాజధానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుంది. జగన్‌ హాయాంలో ఏపీలో జరిగిన లిక్కర్‌ స్కాం కంటే అతిపెద్ద భారీ కుంభకోణం విద్యుత్‌ స్కాం జరిగింది. సెకీ ఒప్పందం విషయంలో జగన్‌ అబద్ధాలు చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌కు దేశభక్తి లేదు, కేవలం డబ్బు భక్తి మాత్రమే ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ గురించి జగన్‌ కనీసం ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు?’ అని సీఎం రమేశ్‌ ప్రశ్నించారు.

Updated Date - May 25 , 2025 | 05:27 AM