Chandrababu Naidu: ఇకపై పన్ను ఎగవేత కుదరదు
ABN , Publish Date - Jun 19 , 2025 | 06:33 AM
రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేయడం ఇకపై కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలో లొసుగులను వాడుకుని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.
ఖజానాకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు
ఇబ్బంది పెట్టకుండా పన్ను వసూలు చేయాలి
రాబడి పెరిగితే మరింత అభివృద్ధి, సంక్షేమం
ఆదాయార్జన శాఖలపై సమీక్షలో సీఎం
ఈ ఏడాది ఆదాయం 1.24 లక్షల కోట్లుగా అంచనా
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేయడం ఇకపై కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలో లొసుగులను వాడుకుని ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు రెవెన్యూ లక్ష్యాలను నిర్దేశించి, పలు సూచనలు చేశారు. పన్ను వసూళ్ల విషయంలో వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు. పన్ను వసూళ్లకు సంబంధించి 2017 నుంచి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సూచించారు.ఆదాయాన్ని పెంచుకోగలిగితే అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత విస్తృతం చేయగలుగుతామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తేనే సమస్యలు తొలగుతాయని.. లేదంటే ఆర్థిక పరిస్థితి శాశ్వతంగా ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. విశాఖ, విజయవాడ లాంటి నగరాల నుంచి ఆదాయం మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ, సహా వాణిజ్య పన్నుల వసూళ్లకు సంబంధించి ఆయా జిల్లాల జాయింట్ కమిషనర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
పెరిగిన ఆదాయం
ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 1.24 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఆదాయం వసూళ్లు పెరిగాయని చెప్పారు. స్టాంపులు రిజిస్ర్టేషన్ల శాఖలో 2025 ఏప్రిల్‌లో రూ. 906.12 కోట్లు, మేనెలలో రూ. 916 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లో రూ. 663.29 కోట్లు, మేనెలలో రూ.583 కోట్లు ఆదాయం ఉన్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, వాణిజ్య పన్నుల విభాగంలో రూ. 43,020 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. నూతన మద్యం విధానం వల్ల రాష్ట్ర ఆదాయం రూ. 2,432 కోట్ల మేర పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ.. గనుల శాఖలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఉపగ్రహ సమాచారాన్ని అనుసంధానం చేయాలని ఆదేశించారు. ఖనిజాలు, ఇసుక తవ్వకాలకు సంబంధించి కచ్చితమైన డేటాను సేకరించడం వల్ల ఆదాయం 30-40 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఎర్రచందనం విక్రయం కోసం అంతర్జాతీయంగా ఉన్న ధరల్ని బేరీజు వేయాలని చెప్పారు. ఉత్తమ ప్రతిభ చూపే అధికారులనే ఆదాయార్జన శాఖల్లోని కీలకమైన విభాగాల్లో నియమించాలని ఆదేశించారు.