Share News

Chandrababu Naidu: ఏజెన్సీలో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు

ABN , Publish Date - May 13 , 2025 | 04:15 AM

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించే జీవో 3 పునరుద్ధరణపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం చట్టపరమైన అంశాలు పరిశీలించి గిరిజనుల హక్కులకు న్యాయం చేస్తామని వెల్లడించారు.

Chandrababu Naidu: ఏజెన్సీలో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు

100% కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం

రద్దయిన జీవో 3 పునరుద్ధరణకు చర్యలు

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటిస్తూనే.. అవకాశాలపై అధ్యయనం చేయండి

గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో సీఎం ఆదేశాలు

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో వంద శాతం కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన గిరిజన సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో జీవో నంబర్‌ 3 తెచ్చామని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. 2020లో న్యాయ సమీక్షలో రద్దు అయిన ఆ జీవో పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు పాటిస్తూనే.. జీవో 3 పునరుద్ధరణకు అవకాశాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. 1986లో వచ్చిన జీవో ప్రకారం ఏజెన్సీలో స్థానిక గిరిజనులకు టీచర్‌ పోస్టుల్లో నూరు శాతం రిజర్వేషన్లు తెచ్చామని, దీనిపై న్యాయపరమైన చిక్కులు రావడంతో మళ్లీ పెరిగిన మహిళా రిజర్వేషన్‌ శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని 2000లో జీవో 3 తెచ్చామన్నారు. దీని అమలు ద్వారా 4,626 టీచర్‌ ఉద్యోగాలు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు దక్కాయన్నారు. అయితే జీవో 3పై 2002లో కొందరు కోర్టును ఆశ్రయించగా.. వివిధ స్థాయిల్లో విచారణ అనంతరం 2020లో ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని సీఎం పేర్కొన్నారు. అయితే గత ప్రభుత్వం దీనిపై సమీక్ష పిటిషన్‌ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందన్నారు. దీంతో సమీక్ష పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసిందన్నారు. దీని వలన గిరిజనులు జీవో 3 లబ్ధిని కోల్పోయారని సీఎం తెలిపారు.


చట్టపరమైన అడ్డంకులపై అధ్యయనం

జీవో 3 పునరుద్ధరణ లేదా అదే తరహా న్యాయం చేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో గిరిజనులకు హామీ ఇచ్చారు. ఆ మేరకు సమీక్షలో భాగంగా ఏజెన్సీలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న అవకాశాలు, చట్టపరంగా ఉన్న వివిధ అనుకూలతలు, అడ్డంకుల గురించి చర్చించారు. జీవో 3 పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై గిరిజనులు, సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. గిరిజనులకు తిరిగి ఆ లబ్ధిని అందించేందుకు అవకాశాలు పరిశీలించాలన్నారు. న్యాయపరమైన అంశాలు, సుప్రీంకోర్టు తీర్పు, గిరిజన హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలను అధ్యయనం చేయాలని సూచించారు.


సీఎం ముందు 3 ఆ ప్ష న్లు

జీవో 3 పునరుద్ధరణపై ప్రస్తుతమున్న మూడు అవకాశాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. మొదటి ఆప్షన్‌గా ఏజెన్సీ ప్రాంతాల్లో వంద శాతం రిజర్వేషన్లు స్థానిక గిరిజనులకు కల్పించడం, రెండో ఆప్షన్‌గా స్థానిక గిరిజనులకు వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం, మూడో ఆప్షన్‌గా సుప్రీంకోర్టు సూచించినట్లు 50 శాతం మించకుండా స్థానిక గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి వారి హక్కులను పరిరక్షించడం వంటి అవకాశాలను చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దీనిపై సీఎం మాట్లాడుతూ గిరిజనుల హక్కులకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల సమయంలో చెప్పినట్లు జీవో 3 పునరుద్ధరించడం లేదా అదే స్థాయిలో గిరిజనులకు న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ విషయంలో జాతీయస్థాయిలో రాజ్యాంగ, న్యాయ నిపుణులతో కూడా సంప్రదింపులు జరపాలన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెంచేందుకు విద్య,వైద్య సదుపాయాలు కల్పిస్తూ.. ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వారికి న్యాయం చేసేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:15 AM