CM Chandrababu: నేరచరిత నేతలను ఊడ్చేయాలి
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:52 AM
రాష్ట్రంలో నేరచరిత్ర గల నేతలు రాజకీయాల్లోకి వచ్చారని, రాజకీయాలు కలుషితమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇంట్లో చెత్తను తొలగించినట్టే...
ఇంట్లోని చెత్తలా వారినీ తొలగించాలి
రాష్ట్రంలో రాజకీయాలు కలుషితం
హింసా రాజకీయాలు చేయను
అలా చేసేవారి గుండెల్లో నిద్రపోతా
సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందిస్తుంటే భగ్నం చేయాలని చూస్తున్నారు
సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తున్నాం
అన్నదాత సుఖీభవ నిధులు కేంద్రం ఇచ్చినప్పుడు ఏపీ వాటానూ జమ చేస్తాం
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం
ఏడాదిలోనే 10 లక్షల కోట్ల ఎంఓయూలు
తిరుపతి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు
హింసా రాజకీయాలు చేయను. అలా చేసే వారి గుండెల్లో నిద్రపోతాను. నేరచరిత్ర గల నేతలు ప్రజల ఆస్తులు కబ్జా చేస్తున్నారు. ప్రజలకు కీడు చేస్తున్నారు. రాష్ట్రానికి ఇలాంటి నేర రాజకీయాలు అవసరమా? వాటిని అడ్డుకోలేమా?
-చంద్రబాబు
తిరుపతి, జూలై 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నేరచరిత్ర గల నేతలు రాజకీయాల్లోకి వచ్చారని, రాజకీయాలు కలుషితమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇంట్లో చెత్తను తొలగించినట్టే, ఇలాంటి నేతలను కూడా ఊడ్చేయాలని పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. తాను తిరుపతిలోనే చదువుకుని ఎమ్మెల్యేగా గెలిచి, అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ‘ఏనాడైనా నేను నేరాలు చేశానా? ఎవరినైనా హత్య చేశానా?’ అంటూ ప్రశ్నించారు. సీఎంగా ప్రజల ఆస్తులు కాపాడాలని, ప్రజలకు భద్రత కల్పించాలని మాత్రమే చూశానని అన్నారు. రాయలసీమలో ముఠాకక్షలు రూపుమాపానని, మతకలహాలు అడ్డుకున్నానని చెప్పారు. ‘రాష్ట్రంలో తీవ్రవాదం ఉండకూడదని పోరాడాను. ప్రతిగా నా ప్రాణం తీయాలని చూశారు’ అని అలిపిరి సంఘటనను గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి తన ద్వారా ఏదో చేయాలన్న ఉద్దేశంతోనే శ్రీవారు తనను కాపాడారన్నారు.
చేసేవి వెధవ పనులు.. పేరేమో సాక్షి
‘‘2019లో సీఎంగా ఉండగా ఒక రోజు నిద్ర లేవగానే వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతిచెందారని సాక్షి టీవీలో వార్త వచ్చింది. అయ్యో పాపం అనుకున్నాను. అయితే పోస్టుమార్టంలో గొడ్డలిపోటుతో జరిగిన హత్య అని తేలింది. గుండెపోటు అని ప్రచారం చేసినవారే సాయంత్రానికల్లా ప్లేటు ఫిరాయించి చంపేశారంటూ వార్త వేశారు. మరుసటి రోజు నా చేతిలో కత్తి ఉన్నట్టు ఫొటో పెట్టి నారాసుర రక్తచరిత్ర అని వార్త పెట్టారు. చేసేవన్నీ వెధవ పనులు.. సాక్షి అని పేరెలా పెట్టారో. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ధరల పతనంతో దెబ్బతిన్న మామిడి రైతులను ఆదుకునేందుకు కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ ప్రకటించాను. రైతుల నుంచి మామిడి కొనుగోలు చేస్తుంటే జగన్ వచ్చి ఆరు ట్రాక్టర్ లోడ్ల మామిడి కాయలను రోడ్డుపై పడేసిపోయాడు. దీంతో రైతులు లబోదిబోమని ఏడ్చారు. నేను సంక్షేమం, అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తూ ఆ ఫలాలు ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తుంటే, దాన్ని భగ్నం చేయాలని చూస్తున్నారు. చేసేవన్నీ తప్పులు, దాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. దీనిపై ప్రజలంతా ఆలోచించాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వైసీపీ వారసత్వ చెత్త 86 లక్షల టన్నులు
‘‘రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల ద్వారా 9 వేల టన్నుల చెత్త పోగు పడుతోంది. అందులో తడి చెత్త 5,500 టన్నులు, పొడి చెత్త 3,400 టన్నులు ఉంటోంది. గత వైసీపీ ప్రభుత్వం చెత్తపై పన్ను వేసింది కానీ పారిశుధ్యం గురించి పట్టించుకోలేదు. వైసీపీ ప్రభుత్వం 86 లక్షల టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి వెళ్లిపోయింది. దాన్ని తొలగించే బాధ్యత మా ప్రభుత్వంపై పడింది. అక్టోబరు 2 కల్లా వైసీపీ వారసత్వ చెత్తను తొలగించాలని ఆదేశించా. డిసెంబరుకల్లా రాష్ట్రంలో ఎక్కడా చెత్త ఉండకుండా చూస్తాం. రాష్ట్రంలో ఇంటింటి నుంచి చెత్తసేకరణను ఇప్పుడున్న 35 శాతం నుంచి 60 శాతానికి, వేస్ట్ ప్రాసెసింగ్ 30 శాతం నుంచి 60 శాతానికి పెంచుతాం. మలేరియా నిర్మూలనకు డ్రోన్లు వినియోగిస్తాం. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో మున్సిపాలిటీలకు 2 వేల విద్యుత్ వాహనాలు అందజేస్తున్నాం. దానికోసం రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నాం. రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకు సోలార్ పవర్ ప్యానెళ్లు మంజూరు చేశాం. ఇళ్లే కాకుండా కార్యాలయాలు, పొలాల్లో కూడా సోలార్ పవర్ వాడేలా ప్రోత్సహిస్తున్నాం’’ అని వివరించారు.
స్వచ్ఛ భారత్‌లో ఏపీ టాప్
‘‘కేంద్రం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా 5 అవార్డులు సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. సూపర్ సిటీస్ విభాగంలో తిరుపతి, గుంటూరు, విశాఖలకు అవార్డులు దక్కాయి. అలాగే వివిధ కేటగిరిల్లో విశాఖ, రాజమండ్రికి అవార్డులు వచ్చాయి. పర్యావరణంలో విజయవాడకు ఏడో ర్యాంకు, తిరుపతికి ఐదో ర్యాంకు వచ్చాయి. ఈ అవార్డులకు పారిశుధ్య కార్మికులే కారణం, ఈ నెలలో ప్లాస్టిక్ కాలుష్యంపై దృష్టి పెడుతున్నాను. ప్లాస్టిక్‌ను నిషేధించాల్సి ఉంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా ఆపేయాలి. 120 మిల్లీ మైక్రాన్‌ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, కప్‌లు వాడకూడదు. స్వర్ణాంధ్ర కోసం సర్క్యులర్ ఎకానమీకి శ్రీకారం చుట్టాలి’’ అని చంద్రబాబు అన్నారు.
‘సూపర్ సిక్స్’ నిలబెట్టుకుంటున్నాం
‘‘గత ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నిలబెట్టుకుంటున్నాం. అమ్మఒడి కింద గత ప్రభుత్వం కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే నగదు ఇవ్వగా, మా ప్రభుత్వం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఇస్తోంది. గత ప్రభుత్వానికి పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టగా, మేము వచ్చీ రాగానే పెంచిన మొత్తం ఇస్తున్నాం. ఏడాదికి 3సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 207 అన్న క్యాంటీన్లు పెట్టాం. ఆగస్టు 20కల్లా డీఎస్సీ పూర్తి చేస్తాం. నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం ఎప్పుడు నిధులిస్తే అప్పుడు ఏపీ వాటా నగదు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం. ఏడాదిలోనే రూ.10 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎంఓయూలు కుదుర్చుకున్నాం. వాటి ద్వారా 9 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. పీ4 కింద 15-20 లక్షల కుటుంబాలను ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఈ విషయంలో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. 2029 కల్లా పేదరికం లేని రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇటీవలే పలువురు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి చర్చించాం. ఒక్కొక్కరు 4-5 వేల కుటుంబాలను దత్తత తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారు. పేదలను ఆదుకునేందుకు మార్గదర్శులు ముందుకు రావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కంచి పీఠాధిపతులతో సీఎం భేటీ
కంచికామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. తిరుపతిలో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. అలిపిరిలో ఇస్కాన్ సమీపంలో ఉన్న కంచికామకోటి మఠానికి శనివారం సాయంత్రం చంద్రబాబు చేరుకున్నారు. చాతుర్మాసదీక్షలో ఉన్న పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములను కలిశారు. స్వామిజీలతో సీఎం సుమారు గంట పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. పీఠం ఆధ్వర్యంలో నడుస్తున్న సంప్రదాయ పాఠశాల, కుంభకర పాఠశాల, మహిళల నాదస్వర పాఠశాల గురించి సీఎంకు మఠం నిర్వాహకులు వివరించారు. విద్యార్థులు తయారు చేసిన పొడులు, పచ్చళ్లు, హెర్బల్ పౌడర్లు, మట్టి పత్రాలు, ఆయుర్వేద మందులు సీఎం స్వయంగా పరిశీలించి అభినందించారు. అనంతరం వారితో కలిసి ఫొటో దిగారు.
రోజంతా చంద్రబాబు బిజీబిజీ
విజయవాడ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రేణిగుంట మండలం తూకివాకం వద్ద తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం తిరుపతి కపిలతీర్థం చేరుకుని కపిలేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అక్కడ స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో కలసి మాట్లాడారు. అనంతరం ప్రజా వేదికలో పాల్గొన్నారు. చివరగా తిరుపతిలోని కంచి మఠంలో బస చేసిన కంచి పీఠాధిపతులను కలిశారు. సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని విజయవాడ తిరుగు ప్రయాణమయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ బడుల్లో నో వేకెన్సీ పరిస్థితి తేవాలి
Read latest AP News And Telugu News