CM Chandrababu Naidu: ఇక గేరు మారుస్తా..
ABN , Publish Date - Jun 01 , 2025 | 03:36 AM
ఏపీ సీఎం చంద్రబాబు ‘అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుడుతున్నాం’ అంటూ ప్రజావేదికలో చెప్పారు. పింఛన్లు, ఉచిత సిలిండర్లు, సోలార్ ప్యానెల్లు, గంజాయి నియంత్రణ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
ఈ నెల 12తో పాలనకు ఏడాది పూర్తి
అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం
అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే
లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను
నాది డేగ కన్ను.. ఎవరూ తప్పించుకోలేరు
ఎవరైనా తప్పు చేస్తే చండశాసనుడినవుతా
బడులు తెరిచేలోగా ‘అమ్మకు వందనం’ డబ్బులు
నాలుగు నెలలకోసారి గ్యాస్ డబ్బులు వేస్తున్నాం
మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు
గత ప్రభుత్వంలో కేంద్ర పథకాల నిధులు పక్కదారి
ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక అన్నీ సరిచేస్తున్నాం
చెయ్యేరు ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు
అమలాపురం, మే 31(ఆంధ్రజ్యోతి): అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాం. ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోను. ఈ నెల 12వ తేదీతో ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్నాం. ఇకపై గేరు మారుతుంది. ప్రతిరోజూ సమీక్షలు చేస్తున్నా. నిమిషం ఖాళీ లేకుండా పనిచేస్తున్నాను. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరూ తోక జాడించడం లేదు. నన్ను మోసం చేయాలంటే కుదరదు. అధికారులు పేదల కోసం పనిచేయాల్సిందే’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. రానున్న రోజుల్లో భగవంతుడు కరుణిస్తే పింఛన్ల సొమ్మును మరింత పెంచుతామని అన్నారు. ‘గత ప్రభుత్వ హయాంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే ఎగ్గొట్టేవారు. భర్త చనిపోతే ఆ మరుసటి నెలలో భార్యకు ఇచ్చే స్పౌజ్ పింఛను పథకాన్ని ఇప్పుడు అమలు చేస్తున్నాం. ప్రతినెలా 1వ తేదీన పింఛన్లు అందించే కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటే ప్రజల కష్టాలు అర్థమవుతాయి. ఈ నెలలో 9,176 మందికి మూడు నెలల పింఛన్లు ఒకేసారి అందించాం. లబ్ధిదారు ఎక్కడికివెళ్లినా 3నెలల పింఛను ఒకేసారి తీసుకోవచ్చు. ఇతర రాష్ర్టాల కంటే మనమే పింఛన్ల సొమ్ము ఎక్కువగా ఇస్తున్నాం. అన్ని రాష్ర్టాల కంటే అధికంగా ఆదాయం వచ్చే మహారాష్ట్రలో ఇచ్చే పింఛను రూ.1,000 మాత్రమే. పొరుగున తెలంగాణలో రూ.2,250 అందిస్తున్నారు.

ఎన్‌డీఏ ప్రభుత్వం ద్వారా నేను ఇంటికి పెద్ద కొడుకులా నెలకు రూ.4వేలు చొప్పున ఏడాదికి రూ.48వేలు పింఛను రూపంలో అందిస్తున్నాను. దేశంలోనే ఏడాదికి రూ.34 వేల కోట్లు పింఛన్ల రూపంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. 1న సెలవు వస్తే ముందురోజు పింఛన్లు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదే.’ అని సీఎం పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
మెగా డీఎస్సీ... 3 ఉచిత సిలిండర్లు
‘ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టులతో యువతకు ఉద్యోగాలు కల్పించనున్నాం. దీపం పథకం ద్వారా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం. నాలుగు నెలలకోసారి మహిళల అకౌంట్‌కు గ్యాస్ డబ్బులు జమ చేస్తున్నాం. రూ.1,200 కోట్లతో 20వేల కిలోమీటర్ల రోడ్డు వేశాం. భవిష్యత్‌లో మరిన్ని రోడ్లు వేస్తాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. అవసరమైతే ఇంకా పెంచుతాం. ఎన్‌డీఏ ప్రభుత్వం వచ్చాక చెత్తపన్ను రద్దు చేశాం. 83లక్షల టన్నుల చెత్తను అక్టోబరు కల్లా తీసి వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఒకేరోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు. పల్లె వెలుగు కింద రూ.4,500 కోట్లు వెచ్చించి 30వేల పనులకు శ్రీకారం చుట్టాం. గ్రామాల్లో వెలుగులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం.’
సోలార్ ప్యానెళ్లు పెట్టుకోండి
ఎస్సీ, ఎస్టీలకు హామీ ఇస్తున్నా.. మీ ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు పెట్టుకోండి.. 2కిలోవాట్ల వరకు సోలార్ ప్యానెళ్లు ఉచితంగా అందిస్తాం. బీసీలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రూ.20వేల రాయితీ ఇస్తాం. ప్రతి నియోజకవర్గంలో 10వేల ఇళ్లకు సోలార్ పెట్టాలి. ఇలా పెట్టించకపోతే ఎమ్మెల్యేలకు పవర్ కట్ అవుతుంది. కలెక్టర్‌కు కూడా నోటీసులిస్తాం.
గంజాయి అమ్మినా... వాడినా తాటతీస్తా
గంజాయి, డ్రగ్స్ వాడకం గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయింది. కిరాణా షాపుల్లో కూడా దొరికేది. మా ప్రభుత్వంలో గంజాయి అమ్మినా, వాడినా తాటతీస్తా. గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం. నవజాతి శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీకిట్లను ప్రవేశపెట్టాం. తల్లికి వందనం కింద స్కూల్ తెరిచే నాటికి ప్రతి విద్యార్థికి రూ.15వేలు అందిస్తాను. మీ ఊరిలో జనాభా బాగా తగ్గిపోతోంది. సంతానం లేకపోతే అందరూ వృద్ధులే ఉంటారు. వాళ్లు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు. మళ్లీ చెయ్యేరు ఎక్కడ ఉందంటే రికార్డులో వెతుకోవాల్సి వస్తుంది. అందుకే జనాభాను పెంచేందుకు మీరు బాధ్యత తీసుకోవాలి. ఇద్దరి కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనాలి. అన్నదాత సుఖీభవ జూన్ నుంచే ప్రారంభిస్తాం. కేంద్రం అందిస్తున్న పథకాన్ని మూడు విడతల్లో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. ఇది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. నిరంతరం పేదలకు ఇబ్బందులకు లేకుండా ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఆగస్టు 15నుంచి కల్పించనున్నాం. సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నా. జస్టిస్ పునయ్య కమిషన్ ఏర్పాటు చేసి దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ. రాజమహేంద్రవరంలో ఓ పాస్టర్ సహజంగా మరణిస్తే రాజకీయం చేస్తున్నారు. గతంలో బాబాయిని చంపి గుండెపోటుతో మరణించిన్నట్లు చిత్రీకరించారు. ఇప్పుడూ అదే చేయాలని అనుకుంటున్నారు. తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తే చూస్తూ ఊరుకోను.
త్వరలో సంక్షేమ క్యాలెండర్
‘త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తాను. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రజలు ఇబ్బందులు పడకుండా రేషన్ డీలర్ల వద్దే సరుకులు తీసుకునే విధానం అమలు చేస్తున్నాం. రేషన్ తెచ్చుకోలేని వారి కోసం డోర్ డెలివరీ అందిస్తాం. బియ్యం మాఫియాకు అడ్డుకట్ట వేస్తాం.’
‘గత ప్రభుత్వం హయాంలో 94 పథకాలకు కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించి రాష్ర్టాన్ని బ్లాక్‌లిస్టులో పెట్టే పరిస్థితి తెచ్చారు. వీళ్లు దుర్వినియోగం చేసిన డబ్బులు చెల్లించి తిరిగి ఆ పథకాలను పునరుద్ధరించాం.’
‘ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువమంది ముందుకొస్తున్నారు. ఎందుకని నన్ను ఢిల్లీలో అడిగారు. మా రాష్ట్రమే వేరు. ఇక్కడ సీబీఎన్ ఉన్నాడు. వేరే రాష్ర్టాల కంటే భిన్నంగా ఆలోచిస్తానని చాలా స్పష్టంగా చెప్పా.’
‘వాట్సాప్ గవర్నెన్స్‌లో ర403 రకాల సేవలు అందిస్తున్నాం. ఈ నెల 12 నుంచి 500 సేవలు అందిస్తాం.
‘నాది డేగ కన్ను.. నానుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎవడైనా తప్పు చేస్తే చండశాసనుడిగా ఉంటాను. తోక జాడిస్తే.. కట్ అయిపోతుంది.’
-సీఎం
92 శాతం పెన్షన్లు పంపిణీ
తొలి రోజు 58.50 లక్షల మందికి అందజేత
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా శనివారం 92.52 శాతం సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. జూన్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ చేపట్టారు. మొత్తం 63 లక్షల మందికి పెన్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.2,717 కోట్లు విడుదల చేసింది. శనివారం 58.50 లక్షల మంది సామాజిక పెన్షన్‌దారులకు ఉద్యోగులు నగదు అందించారు. అత్యధికంగా అన్నమయ్య జిల్లాలో 94.69 శాతం పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం చెయ్యేరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
శ్రీకాంత్ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు
కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు
Read Latest AP News And Telugu News