Banakacharla Review: కేంద్రంతో చర్చలకు 14న ఢిల్లీకి సీఎం
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:21 AM
పోలవరం- బనకచర్ల అనుసంధాన పథకంపై పడిన పీటముడిని విడదీయడానికి ఈ నెల 14న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన బనకచర్లపై కేంద్రానికి నివేదిక అందిస్తారు.
బనకచర్ల ఆవశ్యకతపై ఢిల్లీ పెద్దలకు నివేదిక
తెలంగాణ అభ్యంతరంతో పీటముడి
18న పోలవరంపై జలశక్తి సంఘం సమీక్ష
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పోలవరం- బనకచర్ల అనుసంధాన పథకంపై పడిన పీటముడిని విడదీయడానికి ఈ నెల 14న సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ పర్యటనలో ఆయన బనకచర్లపై కేంద్రానికి నివేదిక అందిస్తారు. కేంద్ర పెద్దలను కలసి ఈ అంశంపై చర్చించనున్నారు. సముద్రంలోకి వెళ్లే గోదావరి వరద జలాల్లో 200 టీఎంసీలను మాత్రమే బనకచర్ల పథకానికి వినియోగిస్తామని స్పష్టంచేయనున్నారు. సీఎం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ పథకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నదీ జలాల పంపకాల విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందామంటూ రాష్ట్ర విభజన జరిగిన నాటినుంచీ చంద్రబాబు సూచిస్తూనే ఉన్నారు. 2016 సెప్టెంబరు 5న అప్పటి జలశక్తి మంత్రి ఉమాభారతి నేతృత్వంలో, నాటి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు మధ్య తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణా- గోదావరి నదీ జలాల పంపకాలపై అవగాహన కుదిరింది. అయినా... బనకచర్లపై వివాదాలు తప్పలేదు.
పోలవరంపై 18న కేంద్రం సమీక్ష
పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌నాటికి పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించిన జల శక్తి సంఘం, ఈ ప్రాజెక్టు ప్రగతిపై 18న సమీక్షించనున్నది. పోలవరం ప్రధాన డ్యామ్ పనులు ఎంతవరకూ జరిగాయనేది జలశక్తి కార్యదర్శి దేబర్షి ముఖర్జీ నాయకత్వంలో పరిశీలించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ తదితరులు హాజరుకానున్నారు.