Share News

Chandrababu Naidu: నేరస్థులకు నేరగాడి అండ

ABN , Publish Date - Jun 05 , 2025 | 04:54 AM

మాజీ సీఎం జగన్‌ నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి వారితో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘విజయ్‌ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లు శిక్ష నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచిపోయారు.

Chandrababu Naidu: నేరస్థులకు నేరగాడి అండ

గత ప్రభుత్వ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోంది. నేరం రుజువయ్యాక ఎవరినీఉపేక్షించేది లేదు. అయితే రాజకీయ కక్ష సాధింపు మన విధానం కాదు.

-చంద్రబాబు

రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు: చంద్రబాబు

ఒకప్పుడు క్రిమినల్స్‌ను కలవడానికి నాయకులు భయపడేవారు

ఇప్పుడు నిస్సిగ్గుగా కలవడమే కాదు.. వారి దన్నుతో రాజకీయం చేస్తున్నారు

వైసీపీ వారు వేధించారని మనమూ వారిని వేధించడం సరికాదు

తప్పు చేశారని రుజువైతే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు

అదే మన విధానం..

కక్ష సాధింపులు మన పద్ధతి కాదు

క్యాబినెట్‌ భేటీలో సీఎం స్పష్టీకరణ

అమరావతి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ సీఎం జగన్‌ నేరపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి వారితో చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘విజయ్‌ మాల్యా లాంటి ఆర్థిక నేరగాళ్లు శిక్ష నుంచి తప్పించుకోవడానికి దేశం విడిచిపోయారు. కానీ జగన్‌ లాంటి ఆర్థిక నేరగాడు రాష్ట్రంలోనే ఉంటూ ఇతర నేరస్థుల్ని ఏకంచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడే ఉంటూ వారిని ప్రేరేపిస్తున్నారు. రాజకీయ ముసుగులో ఒక నేరస్థుడు ఇతర నేరస్థులకు అండగా నిలుస్తానంటున్నాడు. ఇది ఏ తరహా రాజకీయమో ప్రజలే అర్థం చేసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జగన్‌ తీరుపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేరస్థుల్ని రాజకీయ నాయకులు కలవాలంటే భయపడేవారని.. ఇప్పుడు నిస్సిగ్గుగా.. బహిరంగంగా.. నేరగాళ్లను కలవడమే కాకుండా వారిని అడ్డం పెట్టుకునే రాజకీయాలు చేస్తున్నారని.. నేరస్థులకు అండగా ఉన్నామని సందేశమిస్తూ రాజకీయాలను అధోగతికి తీసుకుపోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో తప్పులు చేసిన వారు ఇంకా బయటే తిరుగుతున్నారంటూ పలువురు మంత్రులు ప్రస్తావించారు. జగన్‌లో అరెస్టు భయం పెరుగుతోందని కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు. గతంలో ఏ తప్పూ చేయకుండానే చంద్రబాబును, పలువురు టీడీపీ నాయకులను జైళ్లకు పంపారని.. ఘోరమైన తప్పులు చేసి కూడా జగన్‌లాంటి వారు ఇంకా బయటే తిరుగుతున్నారని మంత్రి సంధ్యారాణి అన్నారు. దీనిపై సీఎం స్పందించారు. ‘తప్పు చేసినవారు శిక్ష నుంచి తప్పించుకోలేరు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో మనల్ని వేధించారని.. మనమూ అదే పంథాలో వైసీపీ నేతలను వేధించడం సరికాదు’ అన్నారు.


క్వాటమ్‌ వ్యాలీపై అవగాహన..

క్యాంటమ్‌ వ్యాలీపై ప్రజల్లో అవగాహన పెంచాలన్న సీఎం.. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో వివరించాలని సూచించారు. ప్రస్తుత కంప్యూటర్లు 8 గంటల్లో చేసే పనిని క్వాంటమ్‌ వ్యాలీ కంప్యూటర్ల ద్వారా 12 నిమిషాల్లోనే పూర్తిచేయవచ్చని.. ఇలాంటి అంశాలను సామాన్య ప్రజలకు తెలియజెబితే.. వారికి ఈ ప్రాజెక్టు గొప్పదనం అర్థమవుతాయన్నారు. క్వాంటమ్‌ వ్యాలీ భవన నిర్మాణ డిజైన్లను తయారు చేస్తున్నారంటూ.. వాటిలో కొన్నింటిని మంత్రివర్గ సహచరులకు చూపించారు. మిగిలిన డిజైన్లు కూడా సిద్ధమయ్యాక డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు చూపించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సానుకూలత వ్యక్తమైందని సీఎం మంత్రులకు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ జరుగుతోందని అన్నారు. తక్షణం దీనిని చేపట్టాల్సి ఉందని.. కేంద్రం సహకారంతో పాటు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ), ఇతర బ్యాంకుల నుంచీ రుణాలు తీసుకుని సునాయాసంగా పూర్తి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

మంత్రి స్వయంగా ఆహ్వానిస్తారు..

ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని చంద్రబాబు మంత్రులకు సూ చించారు. ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందులో భాగంగా 15న తిరుపతిలో సినిమా తారలతో యోగాంధ్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ స్వయంగా వెళ్లి సినిమా నటులను ఆహ్వానిస్తారని తెలిపారు.

మంత్రులతో కలిసి భోజనం చేసిన సీఎం, డిప్యూటీ సీఎం

క్యాబినెట్‌ సమావేశం ముగిశాక సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంత్రులతో కలిసి భోజనం చేశారు. ఆ సమయంలో కడప మహానాడు విజయవంతం పై మంత్రులను అభినందించిన బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో మహానాడు నిర్వహించాలంటే వేసవి సమయం కావడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, స్టేజీ ఎక్కేసరికి చొక్కాలు తడిచిపోయేవని, వేడికి తట్టుకోలేక పసుపు చొక్కాలను నీళ్లలో ముంచి వేసుకున్నా ఇట్టే ఆరిపోయేవని వ్యాఖ్యానించారు. ఈసారి వాతావరణం బాగా అనుకూలించిందని, ఆహ్లాదకర వాతావరణంలో మహానాడు నిర్వహించుకోగలిగామన్నారు. కూట మి పట్ల ప్రజల్లో సానుకూలతను మహానాడు తెలియజేసిందన్నారు.


లోకేశ్‌పై పవన్‌ ప్రశంసలు

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత, మంత్రి లోకేశ్‌ క్యాబినెట్‌ సమావేశం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు, ఇతర మంత్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. నాటి వైసీపీ రాక్షస పాలనపై ప్రజలను చైతన్యపరచడంలో యువగళం పాదయాత్ర సఫలీకృతమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కూడా కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ఆనాటి అనుభవాలను కళ్లకు కట్టినట్లుగా పుస్తక రూపంలో తేవడంపై లోకేశ్‌ను ప్రశంసించారు. అరాచకపాలన అంతమై ఇవాళ్టికి ఏడాది పూర్తయిందని.. ఆ పీడకలను ఇప్పటికీ జనం మరచిపోలేదని తెలిపారు. పాదయాత్ర అనుభవాలను లోకేశ్‌.. పవన్‌తో పంచుకున్నారు.

దూకుడు పెంచండి

ఏడాది పాలన అంతా బాగానే సాగిందని, వచ్చే ఏడాది కాలానికి పక్కా ప్రణాళిక వేసుకుని మరింత సమర్థంగా పనిచేయాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ‘ప్రజా సమస్యల పరిష్కారమే మన ఎజెండా కావాలి. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలి. మనం అమలు చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమం అంతిమ లబ్ధిదారుకు చేరేలా దృష్టి పెట్టాలి’ అని సూచించారు. యోగా దినోత్సవం విజయవంతంపై ప్రస్తుతం రాష్ట్ర యంత్రాంగమంతా దృష్టిసారించిందని.. అందుచేత కూటమి సర్కారు ఏడాది విజయోత్సవాలేవీ ఇప్పుడొద్దని చెప్పారు. పీ-4 విధానం సక్రమ అమలుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. దీనిని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. ఈ నెల 12వ తేదీలోగా ప్రతి జిల్లా కేంద్రంలో పీ-4 కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.


‘సీఎం దార్శనికుడు’

ఏడాది కాలంలో 25 మంత్రివర్గ సమావేశాలు నిర్వహించామని మంత్రివర్గ సహచరులకు సీఎం వివరించారు. గత ఏడాది ఇదే రోజున ఫలితాలు వెలవడడానికి ముందు వరకూ జరిగిన వివిధ సంఘటనలను పలువురు మంత్రులు గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం, ఆయన పోరాటాలు వంటి అంశాలను ప్రస్తావించారు. ఈ 25 మంత్రివర్గ సమావేశాల్లో రాష్ట్ర ప్రగతికి దిశానిర్దేశం చేసే ఎన్నో కీలక, సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారని, ఆయన దార్శనికుడని ప్రశంసిస్తూ మంత్రిమండలి చప్పట్లతో అభినందించింది.

జీవోలతో జాగ్రత్త..

తుని రైలు దహనం కేసు అంశం క్యాబినెట్‌లో ప్రస్తావనకు వచ్చింది. ప్రతి జీవోను జాగ్రత్తగా గమనించాలని సీఎం మంత్రులను ఆదేశించారు. పొరపాటు జరిగాక సరిదిద్దుకోవడం కంటే ముందే జాగ్రత్త పడాలన్నారు. తుని కేసు నిందితులను నిర్దోషులుగా విడుదల చేస్తూ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో అప్పీల్‌ చేయాలని హోం శాఖ యాంత్రికంగా జీవో ఇవ్వడం.. తమకు చెప్పకుండా చేయడంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తంచేయడంతో దానిని ఉపసంహరించుకోవడం తెలిసిందే. ఈ తరహా పరిణామాలు ఇక పునరావృతం కాకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. జరిగిన పొరపాటుకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజీత్‌ సీఎంకు క్షమాపణలు చెప్పారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 05 , 2025 | 05:36 AM