CM Chandrababu Orders Vigilance: అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - Aug 14 , 2025 | 05:10 AM
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ..
ఆకస్మిక వరద ప్రవాహాలను అంచనా వేయండి
కాలువలు, చెరువుల గట్లను పటిష్ఠం చేయండి
లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చండి
జిల్లాల్లో పరిస్థితిని కలెక్టర్లు పర్యవేక్షించాలి
రైతులకు ఎప్పటికప్పుడు సమాచారమివ్వండి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష
జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు: హోంమంత్రి
అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీ్‌సలో భారీ వర్షాలపై మంత్రులు, అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు అనిత, రామానాయుడు, సీఎస్ విజయానంద్ సహా విపత్తు నిర్వహణ, వ్యవసాయ, జలవనరుల శాఖల ఉన్నతాధికారులు హాజర య్యారు. సీఎం మాట్లాడుతూ.. కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉంటూ, జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు రైతులకు తక్షణ సమాచారం అందించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువ ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రకాశం బ్యారేజికి దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా ఉండేలా గుర్రపుడెక్క, తూటికాడను తొలగించాలని స్పష్టం చేశారు. అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్ఠం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద నిర్వహణ పనుల్లో భాగంగా రూ.40 కోట్లతో బుడమేరు-వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు సీఎం అనుమతి మంజూరు చేశారు. కృష్ణా నదిలో గురువారం నాటికి 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర విడుదల చేశామని వివరించారు. మరోవైపు ఎగువ నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను ఎత్తినట్లు అధికారులు వివరించారు.
అధికారులు సిద్ధంగా ఉండాలి: హోంమత్రి అనిత
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు సూచించారు. వర్షప్రభావ ప్రాంత ప్రజలకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తాడేపల్లిలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి వాతావరణ వివరాలను ఆమె పరిశీలించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి కోస్తా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఆదివారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం విపత్తు నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ టోల్‌ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101లను సంప్రదించాలన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 3.44లక్షల క్యూసెక్కుల నుంచి 4.5లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నందున గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల నదీ పరివాహక, లోతట్టు ప్రాంత ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. వాగులు, కాలువలు, కల్వర్టుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జయలక్ష్మి, డైరెక్టర్ ప్రఖర్‌జైన్, ఎస్డీఆర్‌ఎఫ్ ఐజీ రాజకుమారి, ఎన్డీఆర్‌ఎఫ్ కమాండెంట్, ఏపీ ఐఎండీ డైరెక్టర్ స్టెల్లా, ఏపీఎస్డీఎంఏ ఈడీ వెంకట దీపక్ తదితరులు పాల్గొన్నారు.