Share News

TDP Welfare Programs: సంక్షేమ సందడి

ABN , Publish Date - May 15 , 2025 | 03:17 AM

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమం బలంగా అమలు చేస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను విడుదల చేసి, అన్ని అనివార్య ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించిందని చెప్పారు.

TDP Welfare Programs: సంక్షేమ సందడి

12న పండుగ

జూన్‌ 12న లక్ష మందికి పైగా వితంతువులకు పింఛన్లు

బడులు తెరిచేలోగా తల్లుల ఖాతాల్లో ‘తల్లికి వందనం’

ఇకనుంచి 3 గ్యాస్‌ సిలిండర్ల డబ్బు ముందుగానే జమ

త్వరలోనే సంక్షేమ పథకాల క్యాలెండర్‌ విడుదల

గిరిజనులకూ పథకాలు అందేలా ప్రత్యేక డ్రైవ్‌లు

16, 17, 18లో అన్ని నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీలు

మహానాడులోపే నీరు-చెట్టు, ఉపాధి బకాయిలు చెల్లింపు

టీడీపీ పొలిట్‌బ్యూరోలో కీలక నిర్ణయాలు

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఒకటొకటిగా నెరవేరుస్తున్నామని, ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సుమారు 3గంటల పాటు నిర్వహించిన పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో 12 అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశం వివరాలను పొలిట్‌బ్యూరో సభ్యులు.. మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విలేకరులకు వివరించారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వితంతు పింఛన్లు కూడా ఇవ్వలేదని, ఇలాంటివారు రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షమందికి పైగా ఉన్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజును పురస్కరించుకుని జూన్‌ 12న వీరందరికీ పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గ్యాస్‌ లబ్ధిదారులకు ఇప్పటి వరకు సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత వారి ఖాతాల్లో డబ్బులు వేసేవారని, దీనిపై ఫిర్యాదులు వస్తుండటంతో ఇకపై 3 సిలిండర్లకు సంబంధించిన మొత్తాన్ని ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో వేయాలని నిర్ణయించామని వివరించారు.

gj.jpg

పాఠశాలలు తెరిచే సమయానికి జూన్‌ 12లోగా ‘తల్లికి వందనం’ డబ్బులను తల్లుల ఖాతాలో వేయనున్నట్లు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కింద కేంద్రం రైతుల ఖాతాల్లో నిధులు వేసిన రోజే రాష్ట్ర ప్రభుత్వం కూడా వేసేలా పొలిట్‌బ్యూరో నిర్ణయం తీసుకుందని వివరించారు. ఏడాదిలో అమలు చేయనున్న సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించామని, ప్రతినెలా ఒక సంక్షేమ పథకానికి సంబంధించిన కార్యక్రమాలతో క్యాలెండర్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతాన్ని పురస్కరించుకుని ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలు నిర్వహించనున్నామని, వీటిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొంటాయని తెలిపారు.


కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే గతంలో రూ.2 లక్షలు ఇచ్చేవారమని, ఈ ఏడాది జనవరి నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 190 మంది రూ.9.57 కోట్లు చెల్లించామని వివరించారు. ఈ చెల్లింపులు ఆలస్యం లేకుండా చూడాలని తీర్మానం చేశామన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలన్నీ మే నెలాఖరు నాటికి, జిల్లాస్థాయి కమిటీలు మహానాడులోగా పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులుగా మూడు విడతలు, ఆరేళ్ల పాటు పనిచేసిన వారిని అంతకన్నా పెద్ద పదవుల్లో నియమించాలే తప్ప అదే పదవిలో కొనసాగించకూడదని నిర్ణయించామని చెప్పారు.

ఘనంగా మహానాడు

మే 27, 28, 29 తేదీల్లో కడప జిల్లా సీకే దిన్నె మండలంలో జాతీయ రహదారి పక్కనే మహానాడు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కాగా, నీరు-చెట్టు పనులకు సంబంధించి రూ.445 కోట్లు, ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.211 కోట్లు బకాయిలు ఉన్నాయని వీటిని మహానాడులోగా చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డులు లేని గిరిజనుల కోసం ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని, ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని తీర్మానించారు. తెలుగుదేశం పార్టీకి ఇప్పటివరకు వివిధ యాప్‌లను కలిపి ‘మై టీడీపీ’ యాప్‌ను తీసుకొస్తున్నారు. పార్టీ అధ్యక్షుడి నుంచి కార్యకర్త వరకు అందరూ ఇకపై ఈ యాప్‌ను మాత్రమే వినియోగించాలని నిర్ణయించారు. మహానాడు నుంచే దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం రాష్ట్రస్థాయిలో పార్టీ అధ్యక్షుడి నేతృత్వంలో, జిల్లాస్థాయిలో జిల్లా మంత్రి ఆధ్వర్యంలో త్రీమెన్‌ కమిటీలు ఏర్పాటు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 05:52 AM