CM Chandrababu: వ్యక్తిత్వ హననం బాధాకరం
ABN , Publish Date - May 19 , 2025 | 05:31 AM
సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వ హననం, దుష్ప్రచారాలు పెరుగుతున్నందుకు బాధ వ్యక్తం చేశారు. తెలుగు జాతి సేవ చేయాలని, అమరావతిని టాప్ సిటీగా అభివృద్ధి చేయాలని సంకల్పం వ్యక్తపరిచారు.

సోషల్ మీడియాను కట్టడి చేయాలి: సీఎం
ఎన్ని జన్మలెత్తినా తెలుగువాడిగానే పుట్టాలని ఉంది: చంద్రబాబు
జీవితంలో ఎవరికీ దక్కని విధంగా.. ఒకప్పుడు హైదరాబాద్.. ఇప్పుడు తెలుగు జాతి కోసం అమరావతిని టాప్ సిటీగా తీర్చిదిద్దే అవకాశం నాకే దక్కింది. దేశంలో టాప్ సిటీలుగా హైదరాబాద్, అమరావతి నంబర్ వన్, నంబర్ టూ స్థానాల్లో ఉంటాయని భావిస్తున్నా.
- చంద్రబాబు
హైదరాబాద్, మే 18(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం, దుర్మార్గమైన ఆలోచనలు చేసినప్పుడు వాటిని ఎలా కట్టడి చేయాలన్నదానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. సాంకేతిక పురోగతి మంచిదేనని.. కానీ దానిని కొందరు చెడుకు ఉపయోగిస్తున్నారని ఆక్షేపించారు. సోషల్‌మీడియా వేదికగా దుష్ప్రచారాలు, వ్యక్తిత్వహననానికి పాల్పడడం బాధాకరమని.. ఇంట్లో ఉండే ఆడబిడ్డలకూ ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ వెబ్‌సైట్ రజతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సరైన మీడియాను ఏవిధంగా ప్రోత్సహించాలో ప్రభుత్వాలు దృష్టిపెట్టాలని సూచించారు. తాను సీఎంగా ఉన్నపుడు హైటెక్ సిటీ కట్టించి.. తెలుగువారికి ఐటీ రంగాన్ని చేరువ చేశామన్నారు. దానివల్లే ఆ రంగంలో తెలుగువారు వివిధ దేశాల్లో తమ ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ‘ప్రస్తుతం ఆఫీసులకు వెళ్లి కష్టపడే పనిలేకుండా వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేసి.. సంపాదించే అవకాశాలొచ్చాయి. భవిష్యత్‌లో ఇంకా మార్పులొస్తాయి. క్వాంటమ్ వ్యాలీ, ఏఐ వంటి నైపుణ్యాంశాల్లో తెలుగువారు అగ్రస్థానంలోఉండాలి. మనం పనిచేస్తే.. ప్రజలు గుర్తుంచుకోరని అనుకుంటాం.. నేను కష్టంలో ఉన్నప్పుడు, జైల్లో ఉన్నప్పుడు నాకోసం ప్రజలు స్పందించడాన్ని జీవితాంతం మరచిపోను.. ఎన్ని జన్మలెత్తినా తెలుగువాడిగానే పుట్టాలని.. ఈ జాతికి సేవ చేయాలని భావిస్తున్నా’ అని తెలిపారు. త్రిదండి చినజియర్ స్వామి, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ మురళీమోహన్, నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.