CM Chandrababu Naidu praised: పీపీపీతోనే ప్రగతి!
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:00 AM
విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వాళ్లు.. మళ్లీ తాము అధికారంలోకి వస్తే కాలేజీలు కట్టే వారిని జైల్లో పెడతానని హెచ్చరిస్తుండడం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచించాలని సీఎం చంద్రబాబు కోరారు...
ఒకప్పుడు నాయకులు ఎంతో హుందాగా ఉండేవారు. మహోన్నత విలువలతో రాజకీయాలు నడిపిన వాజపేయి లాంటి గొప్పవారితో కలిసి పనిచేసిన నేను.. ఇప్పుడు చిల్లర వ్యక్తులతో మాటలు పడాల్సి రావడం బాధగా ఉంది.
వాజపేయి ప్రజల కోసం పరితపించేవారు. తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ పోరాటం చేశారు. వాజపేయి మార్గంలోనే ప్రధాని మోదీ ప్రపంచంలో భారత్‌కు అగ్రస్థానం కోసం శ్రమిస్తున్నారు. తెలుగుజాతిని నంబర్ వన్ స్థానంలో చూడడమే నా లక్ష్యం.
- సీఎం చంద్రబాబు
వాజపేయి ఇదే నమ్మారు
మౌలిక వసతులు, ప్రాజెక్టులతో సంపద సృష్టికి నాంది పలికారు: సీఎం
జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచారు
ఇప్పుడు పీపీపీలో కాలేజీలు కడితే జైల్లో పెడతామంటున్నారు
ఈ హెచ్చరికలపై ప్రజలు ఆలోచించాలి
దేశ భవిష్యత్‌కు బాటలు వేసిన మహనీయుడు వాజపేయి
అణు పరీక్షలతో బలమైన శక్తిగా మార్చారు
సుపరిపాలన, విలువలతో కూడిన రాజకీయం ఆయన సొంతం
ఆర్థిక సంస్కరణలను పీవీ ప్రారంభిస్తే వాజపేయి వాటిని కొనసాగించారు
మాజీ ప్రధాని, కలాంతో కలిసి పనిచేయడం నా అదృష్టం: చంద్రబాబు
అమరావతిలో వాజపేయి విగ్రహావిష్కరణ
హాజరైన కేంద్ర మంత్రి చౌహాన్
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన వాళ్లు.. మళ్లీ తాము అధికారంలోకి వస్తే కాలేజీలు కట్టే వారిని జైల్లో పెడతానని హెచ్చరిస్తుండడం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచించాలని సీఎం చంద్రబాబు కోరారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంతో దేశ ప్రగతి సాధ్యమని మాజీ ప్రధాని వాజపేయి నమ్మారని తెలిపారు. నాడు మౌలిక వసతులు, ప్రాజెక్టుల నిర్మాణంతో సంపద సృష్టికి నాంది పలికారని గుర్తుచేశారు. ‘పీపీపీ విధానంలో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మించి.. కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వానికి అప్పగించే వారిని జైల్లో పెడతానంటారా..? అభివృద్ధి పనులు చేసే వారిని జైల్లో పెట్టడం సరైన పద్ధతేనా..’ అని మాజీ సీఎం జగన్‌పై మండిపడ్డారు. వాజపేయి జయంతి (డిసెంబరు 25) సందర్భంగా అటల్-మోదీ సుపరిపాలన యాత్రను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలోనూ మాజీ ప్రధాని విగ్రహాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతిమంగా గురువారం అమరావతిలోని వెంకటపాలెంలో సీఎం చంద్రబాబు, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 13 అడుగుల వాజపేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన సుపరిపాలన సభలో చంద్రబాబు మాట్లాడారు. భారత రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడిగా అరుదైన గౌరవం దక్కించుకున్న వాజపేయి దేశ ప్రగతికి తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ‘ఆయన చేపట్టిన పనులు శాశ్వతం.. ఈ దేశం ఉన్నంత వరకూ ఆయన ప్రజల గుండెల్లో ఉంటారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పీవీ నరసింహరావు అయితే వాటిని కొనసాగించి దేశ భవిష్యత్‌కు బాటలు వేసిన మహనీయుడు వాజపేయి. దేశ నిర్మాణంలో దార్శనికత.. అచంచల సంకల్పం ఉన్న గొప్ప నేత. పాలనకు కొత్తరూపం ఇచ్చి.. దేశ భద్రతను బలోపేతం చేసిన అసలైన దేశభక్తుడు. ఆయన జ్ఞానం, వినయం, విలువలు, కల్మషం లేని మనస్తత్వం తరతరాలకూ ఆదర్శం. కొందరు నేతలు స్వార్థంతో ఉంటారు. మహానుభావులు దేశం కోసమే ఆలోచిస్తారు. పోఖ్రాన్‌లో అణుపరీక్షలతో దేశాన్ని ప్రపంచంలో గొప్ప శక్తిగా తీర్చిదిద్దిన ప్రఖ్యాత క్షిపణి శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, వాజపేయి వంటి గొప్పవారితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం నా అదృష్టం. అమరావతిలో వాజపేయి కాంస్య విగ్ర హం, స్మృతివనం ఏర్పాటు ఆయనకు అసలైన నివాళి. కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినవారిలో ఎన్టీఆర్, వాజపేయి ఆద్యులు. ఆ ఇద్దరూ నాకు స్ఫూర్తి’ అని స్పష్టంచేశారు.
రాజధాని కోసం యజ్ఞం
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అగ్రభాగాన, అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తీర్చిదిద్దే యజ్ఞం చేస్తున్నామని సీఎం అన్నారు. ’అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలిచ్చిన 29 వేల మంది రైతులకు చేతులెత్తి మొక్కుతున్నా.. కేంద్రం సహకారంతో రాజధాని నిర్మాణం వేగంగా చేపడుతున్నాం.. కొత్త సంవత్సరంలో గేర్ మార్చి మరింత స్పీడ్ పెంచుతాం.. ప్రపంచ స్థాయి రాజధాని పూర్తి చేస్తాం..’ అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు సైబరాబాద్‌లో హైటెక్ సిటీతో.. ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీతో.. రాష్ట్రం దూరదృష్టితో ముందుకు వెళ్తోందని చెప్పారు. ‘రాజధాని, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, జాతీయ రహదారులు ఇతర అభివృద్ధిలో ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా సహకరిస్తున్నారు. ఎప్పుడూ ప్రజల్లో ఉండే అరుదైన నాయకుల్లో కేంద్ర మంత్రి చౌహాన్ ఒకరు. అటువంటి నేతతో కలిసి వాజపేయి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. అన్ని జిల్లాల్లో విగ్రహాల ఏర్పాటులో కూటమి పార్టీలు ఉమ్మడిగా పాల్గొనడం ఐక్యతకు చిహ్నమన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఘనంగా పూర్తి చేసిన మాధవ్‌ను అభినందించారు.
సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అన్నారు
ఒకప్పుడు తాను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే, అన్నం పెడుతుందా అంటూ ఎద్దేవా చేశారని సీఎం గుర్తుచేశారు. టెలికాం రంగం నాలెడ్జ్ ఎకానమీకి వెన్నెముకని.. ఈ విషయాన్ని గుర్తించిన వాజపేయి ఈ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారని.. ఇప్పుడు మోదీ బీఎ్‌సఎన్‌ఎల్‌ను 4జీ వైపు తీసుకురావడం మొబైల్ రంగంలో విప్లవానికి దారి తీసిందన్నారు.
వ్యక్తిత్వం.. సాహసం.. వాజపేయి సొంతం: పెమ్మసాని
వ్యక్తిత్వానికి, సాహసానికి వాజపేయి ప్రతిరూపమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివర్ణించారు. అహంకారం లేని నాయకుడని.. శాంతి కోసం పాకిస్థాన్‌కు బస్సులో వెళ్లారని.. ఆ దేశం వక్రబుద్ధి చూపితే కార్గిల్ యుద్ధంతో తగిన బుద్ది చెప్పారని గుర్తు చేశారు.
పేదల ఆకలి తీర్చే అంత్యోదయ: మంత్రులు..
దేశ భద్రతపై రాజీ పడకుండా అణుపరీక్షలు నిర్వహించిన వాజపేయి పేద ప్రజల ఆకలి తీర్చేందుకు అంత్యోదయ పథకానికి అంకురార్పణ చేశారని రాష్ట్ర మంత్రులు కొనియాడారు. విలువలతో కూడిన రాజకీయాలకు, సుపరిపాలనకు బ్రాండ్ అయిన వాజపేయి ఒక్క ఓటుతో ఓడిపోయినప్పుడు పార్లమెంటులో చేసిన ప్రసంగం ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ గొప్పగానే ఉందని పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క మరక కూడా లేని ఆయన.. సమస్యలపై పోరాడడమే కాదు పరిష్కారాన్ని కూడా చూపిన జ్ఞాని అని వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ అన్నారు.
అందరికీ ఆదర్శప్రాయుడు: మాధవ్
విలువలతో కూడిన రాజకీయాలు చేసి అందరికీ ఆదర్శప్రాయుడిగా వాజపేయి నిలిచారని పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు తప్ప శత్రువులు, మచ్చలు లేని స్వచ్చమైన నాయకుడి విగ్రహం అమరావతిలో మొదటిది కావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో అటల్ విగ్రహ ఏర్పాటు, స్మృతివనం సాకారవుతున్నాయని అన్నారు. ఆయన ఆశయాలను మోదీ ముందుకు నడిపిస్తున్నారని, భారత్ బలమైన శక్తిగా ఎదిగి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ గుర్తు కమలంలోని ఐదు రెక్కలను పంచ నిష్ఠలుగా వాజపేయి భావించారని, దేశంలోని ప్రతి బీజేపీ కార్యకర్తా అదే స్ఫూర్తితో సాగుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, ఎంపీలు సీఎం రమేశ్, పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యేలు శ్రవణ్ కుమార్, రామాంజనేయులు, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న రప్పించండి
చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. జనంలో నుంచి ఓ వ్యక్తి లేచి.. ఎన్టీఆర్‌కు భారతరత్న వచ్చేలా చూడా లని కోరాడు. వస్తుందని సీఎం హామీ ఇచ్చారు.