Share News

CM Chandrababu Directs Ministers: పరుగు తీయాలి

ABN , Publish Date - Dec 11 , 2025 | 04:25 AM

వృద్ధి రేటు నుంచి ప్రజల్లో సంతృప్తి దాకా... ఆన్‌లైన్‌లోనే సేవల నుంచి పెండింగ్‌ ఫైల్స్‌ దాకా... కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల నుంచి ఆయా శాఖల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం దాకా...

CM Chandrababu Directs Ministers: పరుగు తీయాలి

  • మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలకు సీఎం ఆదేశం

  • ఆయా శాఖల పని తీరుపై సుదీర్ఘ సమీక్ష

  • ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌, ‘సంతృప్తి’ శాతాలతో ప్రజెంటేషన్‌

  • నిర్దిష్ట లక్ష్యాలు విధిస్తూ ఆదేశాలు

  • సంక్షేమం, అభివృద్ధి.. రెండూ జరగాల్సిందే

  • తగిన విధంగా ఆర్థిక వనరుల సమీకరణ

  • 3 నెలల్లో ప్రజల్లో సంతృప్తి 80 శాతం కావాలి

  • 15 రోజుల్లో ఫైలు క్లియర్‌ చేయాల్సిందే

  • మంత్రులు, కార్యదర్శులు ప్రజల్లోకి వెళ్లాలి

  • జనవరి 15 నుంచి ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌లోనే

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

వృద్ధి రేటు నుంచి ప్రజల్లో సంతృప్తి దాకా... ఆన్‌లైన్‌లోనే సేవల నుంచి పెండింగ్‌ ఫైల్స్‌ దాకా... కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల నుంచి ఆయా శాఖల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం దాకా... అనేక అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బుధవారం సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాల అధిపతులతో మూడుగంటలకుపైగా సమావేశమయ్యారు. ‘మినీ కలెక్టర్ల సదస్సు’ తరహాలో జరిగిన ఈ భేటీలో ఆయా శాఖలపై తన అభిప్రాయాలను సూటిగా చెబుతూ... స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ‘సుస్థిరాభివృద్ధి’ లక్ష్యాలను గుర్తు చేస్తూ... ఆయా శాఖల ‘ప్రోగ్రెస్‌’ కార్డులను వారి ముందుంచారు. 18 నెలల పాలనలో ఏ శాఖ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వివరించారు. ఇక మాన్యువల్‌ ఫైల్స్‌ పెట్టడం కుదరదని... జనవరి 15 నుంచి పరిపాలన మొత్తం ‘ఆన్‌లైన్‌’లోనే సాగాలని స్పష్టం చేశారు. జనవరి 15 తర్వాత ‘వాట్సాప్‌ గవర్నెన్స్‌’లో మొత్తం 1200 సేవలు అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు వాటిని వినియోగించుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శులు రోజుల తరబడి ఫైళ్లను పెండింగ్‌లో పెట్టడం కుదరదని... 15 రోజుల్లో ‘క్లియర్‌’ కావాలని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ప్రజల్లో 69.98 శాతం సంతృప్తి రేటు ఉందని... ఇది మూడు నెలల్లో 80 శాతానికి చేరాలని మంత్రులు, కార్యదర్శులకు లక్ష్యం విధించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చిన నిధులు మురిగిపోయేందుకు వీల్లేదని... వాటికి సంబంధించి రాష్ట్ర వాటా నిధులను విడుదల చేసి ఉపయోగించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నిధులు ఖర్చుచేయక పోతే సంబంధిత మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. దీనికి అనుగుణంగా ఆదాయం పెంచుకుని, ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని ఆర్థిక శాఖకు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అధిక వడ్డీకి అప్పులు తెచ్చిందని... కొన్ని రుణాలను రీషెడ్యూల్‌ చేసుకోగలిగితే మార్చి నాటికి వెయ్యి కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. ఈనెల 17, 18 తేదీల్లో జరిగే కలెక్టర్ల సదస్సులో ఆయా శాఖల లక్ష్యాలు, ప్రగతిపై చంద్రబాబు మరింత స్పష్టమైన, సవివరమైన సూచనలు చేయనున్నారు.

Updated Date - Dec 11 , 2025 | 04:25 AM