Share News

Chandrababu Naidu: ఏడాదిలో లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 03:29 AM

రానున్న ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా, ఎస్‌హెచ్‌జీలకు రూ.65వేల కోట్ల రుణాలు ఇప్పించడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని వివరించారు.

Chandrababu Naidu: ఏడాదిలో లక్షమంది మహిళా  పారిశ్రామికవేత్తలు

  • నియోజకవర్గానికి వెయ్యిమంది చొప్పున... డ్వాక్రాలకు 65వేల కోట్ల రుణాలు

  • వారి జోలికి వస్తే ఎక్కడున్నా పట్టుకొస్తాం

  • మహిళల అమరావతి పోరు చరిత్రాత్మకం

  • అసెంబ్లీలో చంద్రబాబు వ్యాఖ్యలు

  • మహిళా సాధికారతపై మాట్లాడిన సీఎం

  • తల్లి, చెల్లిపై కోర్టుకెళ్లినవారు మహిళలను గౌరవిస్తారా?

  • జగన్‌ చర్య మహిళలపై వేధింపే: బాబు

‘‘రాష్ట్రంలో మహిళలకు తొలిసారి ఆస్తి హక్కు కల్పించింది టీడీపీ. కానీ, జగన్‌ తన చెల్లెలి ఆస్తి కోసం కోర్టుకు వెళ్లారు. ఇలాంటి అంశాలను ఎవరూ ఉపేక్షించకూడదు. తల్లికి, చెల్లికి న్యాయం చేయనివారు సమాజానికి ఏం చేస్తారు?. ఇది మహిళా సాధికారత అనిపించుకోదు. జగన్‌ చర్యను మహిళలను వేఽధించడంగానే చూడాలి.’’

- సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రానున్న ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో డ్వాక్రా, ఎస్‌హెచ్‌జీలకు రూ.65వేల కోట్ల రుణాలు ఇప్పించడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని వివరించారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున పారిశ్రామికవేత్తలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని చంద్రబాబు స్పష్టంచేశారు. అయితే ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని స్పష్టంచేశారు. దీనిని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని, భవిష్యత్తులో మహోద్యమంగా మారి మహిళా పారిశ్రామికవేత్తలు పెరుగుతారని అన్నారు. మహిళా సాధికారతపై బుధవారం అసెంబ్లీలో చేపట్టిన స్వల్పకాలిక చర్చలో సీఎం ప్రసంగించారు. ‘‘టీడీపీని ఎన్టీఆర్‌ స్థాపించినప్పుడే మహిళల సాధికారత కార్యక్రమాలు మొదలయ్యాయి. 1983లో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటుచేశారు. నేను 1995లో విద్య, ఉపాధిలో 33శాతం రిజర్వేషన్‌ తీసుకొచ్చాను. అప్పట్లో దీనిని కొందరు వ్యతిరేకించారు. ఇంతకాలం వెనుకున్నవారు ముందుకొస్తే తప్పులేదని చెప్పాను. అందుకే ప్రతిభాభారతిని సభాపతిని చేశాం. దాని ఫలితంగానే ఇప్పుడు సభలో 21 మంది మహిళలు ఉన్నారు. వచ్చే ఎన్నికలనాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే వారి సంఖ్య 70 నుంచి 75కు చేరుతుంది. ఆడబిడ్డల జోలికొస్తే ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకొచ్చి శిక్షిస్తాం.’’ అని హెచ్చరించారు. అసెంబ్లీలో అరకు కాఫీ: ‘‘పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటుచేయాలని సభాపతిని కేంద్రమంత్రి రామ్మోహన్‌ కోరారు. అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటుచేస్తే బాగుంటుంది’’ అని సీఎం కోరారు. సోమవారంనాటికి ఏర్పాటుచేస్తామని ఉపసభాపతి తెలిపారు.


కొడితే తిరిగి కొట్టాలి : మహిళా ఎమ్మెల్యేలు

‘‘ఎవరైనా దాడులు చేస్తే నాన్న వస్తాడు...అన్న వస్తాడు....అని మహిళలు ఎదురుచూడవద్దు. మనల్ని మనమే కాపాడుకోవాలి’’ అని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి అన్నారు. వాళ్లు రెండు దెబ్బలు కొడితే, తిరిగి ఒక్క దెబ్బయినా కొట్టాలన్నారు. వైసీపీ ప్రభుత్వం పెళ్లి కానుక పథకాన్ని రద్దుచేసి మహిళలకు అన్యాయం చేసిందని గౌతు శిరీష అన్నారు. సభలో పవిత్ర స్ర్తీని అవమానించారని, అందుకే వైసీపీకి ఈ గతి పట్టిందని తంగిరాల సౌమ్య అన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 03:29 AM