Vizag Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన.. పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
ABN , Publish Date - Aug 08 , 2025 | 10:06 AM
Vizag Gas Cylinder Blast: పేలుడు ధాటికి చెక్క, రేకులతో కూడిన వెల్డింగ్ షాప్ తునాతునకలైంది. పక్కనున్న మరికొన్ని షాపులు కూడా బాగా దెబ్బతిన్నాయి. గణేష్, శ్రీను మంటల్లో పడి పూర్తిగా కాలి చనిపోయారు. ముత్యాలు కాలు విరిగిపోయి ఎగిరి దూరంగా పడిపోయింది.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాఖ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతేకాకుండా.. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు.
సంఘటన వివరాలు..
వైజాగ్ హార్బర్ సమీపంలోని బుక్కా వీధిలో బీచ్‌రోడ్డును ఆనుకుని హిమాలయా బార్ పక్కన 40 ఏళ్ల చల్లా గణేష్ కుమార్ వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. విడి భాగాలు దెబ్బ తిన్న బోట్లకు ఈ వెల్డింగ్ షాపులో రిపేర్లు చేస్తుంటారు. ఈ షాపులో ఒడిశా రాష్ట్రానికి చెందిన శ్రీను, మధురవాడకు చెందిన కె.ఎల్లాజీ, బుక్కావీధికి చెందిన చింతకాయల ముత్యాలు, వన్‌టౌన్‌కు చెందిన డి.సన్యాసిరావుతోపాటు మరో ముగ్గురు పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వెల్డింగ్ పనులు చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది.
పేలుడు ధాటికి చెక్క, రేకులతో కూడిన వెల్డింగ్ షాప్ తునాతునకలైంది. పక్కనున్న మరికొన్ని షాపులు కూడా బాగా దెబ్బతిన్నాయి. గణేష్, శ్రీను మంటల్లో పడి పూర్తిగా కాలి చనిపోయారు. ముత్యాలు కాలు విరిగిపోయి ఎగిరి దూరంగా పడిపోయింది. అతడు అత్యంత తీవ్రంగా గాయపడ్డాడు. ఎల్లాజీకి 95 కాలిన గాయాలు అయ్యాయి. సన్యాసిరావు పొట్ట, శరీరంలోకి ఇనుపముక్కలు చొచ్చుకుపోయాయి. పక్క షాపుల యజమానులు చెంగలరావు, రంగారావు తీవ్రంగా గాయపడ్డారు. అందర్నీ ఆస్పత్రికి తరలించారు. ముత్యాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరో ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.
ఇవి కూడా చదవండి
వరమహాలక్ష్మి వ్రతంలో ఈ తప్పులు చేయకండి
వరమహాలక్ష్మి పండుగ రోజు ఆకుపచ్చ గాజులు ఎందుకు ధరిస్తారు?