CID Investigation: పరకామణి చోరీపై విచారణ పూర్తి
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:47 AM
తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో సీఐడీ విచారణ సోమవారంతో ముగిసింది.
నేడు హైకోర్టుకు సీల్డ్ కవర్‌లో నివేదిక.. కోర్టు ఆదేశంతో 25 రోజులు విచారణ
ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్లు, అప్పటి ఈవోను ప్రశ్నించిన సీఐడీ
తిరుపతి/తిరుపతి (నేరవిభాగం), డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో సీఐడీ విచారణ సోమవారంతో ముగిసింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ మంగళవారం హైకోర్టులో సీల్డ్ కవర్‌లో నివేదికను సమర్పించనున్నారు. విచారణలో సీఐడీ ఏమి తేల్చింది...నివేదికలో ఏముంది...నివేదిక పరిశీలించాక హైకోర్టు తీసుకునే చర్యలెలా ఉంటాయి... వాటి పర్యవసానం ఎలా ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో, 2023 ఏప్రిల్‌లో పరకామణిలో హుండీ లెక్కింపు సమయంలో పెద్ద జియ్యంగార్ మఠం గుమస్తా కోయంబత్తూరు రవికుమార్ అమెరికన్ డాలర్లు దొంగలించి పట్టుబడ్డారు. ఈ కేసులో రవికుమార్‌పై నమోదు చేసిన క్రిమినల్ కేసును టీటీడీ విజిలెన్స్ అధికారులు హడావిడిగా లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. రవికుమార్ నుంచి టీటీడీకి విరాళంగా ఆస్తులు రాయించుకున్నారు. ఈ వ్యవహారం వెనుక భారీ కుట్ర జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
హైకోర్టు ఆదేశాలతో....
పరకామణి చోరీ కేసును హడావిడిగా మూసివేయడంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుపతికి చెందిన జర్నలిస్టు మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో ఈ ఏడాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, తిరుమల వన్ టౌన్ పోలీ్‌సస్టేషన్, టీటీడీ కార్యాలయాల్లోని సంబంధిత కేసు ఫైళ్లను, రికార్డులను స్వాధీనం చేసుకుని కోర్టుకు అందజేయాలంటూ సీఐడీని ఆదేశించింది. సీఐడీ చీఫ్ అయ్యనార్ స్వయంగా రంగంలోకి దిగి రికార్డులు స్వాధీనం చేసుకుని హైకోర్టుకు అందజేశారు. అనంతరం అక్టోబరు 27న హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ చీఫ్ స్వయంగా ఈ వ్యవహారంపై విచారణ జరిపి డిసెంబరు 2వ తేదీన నివేదిక అందజేయాలని ఉత్తర్వులిచ్చింది.
భూమన సహా 35 మంది విచారణ
గత నెల 4వ తేదీనఅయ్యనార్ తిరుపతి చేరుకున్నారు. సీఐడీ ఎస్పీ గంగాధర్, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బందితోపాటు అదనంగా టెక్నికల్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్, లీగల్ టీమ్ వంటివి ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి పాతిక రోజుల పాటు విచారణ చేపట్టారు. నిందితుడు రవికుమార్, ఆయన కుటుంబసభ్యులను, బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తులను కూడా విచారించారు. అలాగే పరకామణి చోరీ జరిగినప్పుడు, కేసు లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నప్పుడు పనిచేసిన అప్పటి టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులను, ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. లోక్ అదాలత్‌లో కేసు రాజీకి సంబంధించి కోర్టు సిబ్బంది నుంచి కూడా వివరాలు సేకరించారు. రవికుమార్ పరకామణిలో చోరీ చేయగా పట్టుకుని, ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్న అప్పటి టీటీడీ ఏవీఎ్‌సవో వై సతీశ్‌కుమార్‌ను కూడా విచారించారు.
ఫిర్యాదుదారు మృతి
అనూహ్యంగా రెండోసారి విచారణకు బయల్దేరి వస్తూ గత నెల 14వ తేదీన అనంతపురం జిల్లా పరిధిలో రైలు పట్టాల పక్కన సతీశ్‌కుమార్ తీవ్ర గాయాలతో శవమై కనిపించారు. పోలీసులు హత్య కేసుగా దీనిని విచారిస్తున్నారు. దీనివల్ల వారం రోజుల పాటు తిరుపతిలో సీఐడీ విచారణకు బ్రేక్ పడింది. నవంబరు 21న తిరిగి విచారణ మొదలైంది. టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిని సైతం సీఐడీ అధికారులు విచారించారు. అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని, చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Caste Remarks: మరో వివాదంలో ఐపీఎస్ సునీల్
Cyclonic Circulation: చెన్నైకి చేరువగా తీవ్ర వాయుగుండం