మళ్లీ మొదలైన గజదాడులు
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:14 AM
మూడు నెలల విరామం తర్వాత పులిచెర్ల మండలంలో ఏనుగుల దాడులు మళ్లీ మొదలయ్యాయి. 2024 సంవత్సరం సెప్టెంబరులో మండలంలోకి ప్రవేశించిన 16 ఏనుగుల గుంపు మూడు నెలల పాటు ఇక్కడే తిష్ఠవేసి పంటలకు అపారనష్టం కలిగించాయి.

పులిచెర్ల మండలంలోకి ప్రవేశించిన 12 ఏనుగుల గుంపు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అటవీ అధికారులు
కల్లూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల విరామం తర్వాత పులిచెర్ల మండలంలో ఏనుగుల దాడులు మళ్లీ మొదలయ్యాయి. 2024 సంవత్సరం సెప్టెంబరులో మండలంలోకి ప్రవేశించిన 16 ఏనుగుల గుంపు మూడు నెలల పాటు ఇక్కడే తిష్ఠవేసి పంటలకు అపారనష్టం కలిగించాయి. గత ఏడాది నవంబరు 22న పులిచెర్ల సరిహద్దులోని చిన్నగొట్టిగళ్లు మండలం దేవపట్లవారిపల్లె సమీపంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగల ఉచ్చులో ఏనుగు మృతి చెందాక తలకోన అడవివైపు గజరాజుల గుంపు వెళ్లిపోయింది. సరిగ్గా మూడు నెలల తర్వాత శనివారం రాత్రి సుమారు 12 ఏనుగుల గుంపు మండలంలోకి ప్రవేశించాయి. ముందుగా మంగళంపేట అడవి నుంచి ఎల్లంకివారిపల్లె పంచాయతీ దిగుమూర్తివారిపల్లె సమీపానికి చేరుకున్నాయి. అక్కడినుంచి తిరుపతికి వెళ్లే రోడ్డులోని గోపాలపురం మీదుగా రోడ్డుకు సమీపంలోని యల్లంపల్లెలోని రైతు సతీ్‌షకు చెందిన అరటి, మామిడిచెట్లను పాక్షికంగా విరిచేశాయి. భీమవరం అటవీమార్గంలో వెళుతూ రోడ్డుకు ఇరువైపులా ఉండే కలబందను తొక్కేశాయి. మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మామిడితోటకు అమర్చిన రాతి కూసాలను ధ్వంసం చేశాయి. అనంతరం అడవిలోకి చేరుకొని ఘీంకారం చేస్తున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు.
కళ్యాణి డ్యాంనుంచి వచ్చాయన్న ఎఫ్‌ఎ్‌సవో
ఎఫ్‌ఎ్‌సవో మహమ్మద్ షఫీ, ఎఫ్‌బీవో కృష్ణమూర్తి తమ సిబ్బందితో కలిసి ఆదివారం ఏనుగులు సంచరించిన ప్రాంతానికి చేరుకున్నారు. గత ఏడాది మండలంలో పంటలను ధ్వంసం చేసిన 16 ఏనుగుల గుంపు తలకోన అడవిలో ఉన్నాయని చెప్పారు. కళ్యాణి డ్యాం వద్ద ఉన్న మరో 12 ఏనుగుల గుంపు ప్రస్తుతం పులిచెర్ల మండలంలోకి ప్రవేశించాయన్నారు. ఈ గుంపులో పిల్ల ఏనుగులు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.