ఆలయాలకు పాలకమండళ్లపై కసరత్తు షురూ
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:38 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. జిల్లావాసులకు టీటీడీ చైర్మన్, ఆర్టీసీ వైస్ చైర్మన్ వంటి పదవులు దక్కిన విషయం తెలిసిందే. జిల్లాస్థాయిలో ఇంకా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి నోచుకోలేదు.

టీడీపీ అధిష్ఠానం సూచనతో జాబితాలు సిద్ధం చేస్తున్న ఎమ్మెల్యేలు
కుప్పంలో ఒక్కోదానికి మూడు కమిటీల సిఫారసు
ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ఆశావహులు
జనసేన, బీజేపీ నాయకులకూ అవకాశం
చిత్తూరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దశల వారీగా నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. జిల్లావాసులకు టీటీడీ చైర్మన్, ఆర్టీసీ వైస్ చైర్మన్ వంటి పదవులు దక్కిన విషయం తెలిసిందే. జిల్లాస్థాయిలో ఇంకా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీకి నోచుకోలేదు. ఇటీవల టీడీపీ అధిష్ఠానం ఆలయాలకు పాలకవర్గాలను నియమించేందుకు పేర్లను సిఫారసు చేయాలని సూచించింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఆలయాలకు పాలకమండలి కోసం పేర్లతో జాబితాను సిద్ధం చేస్తున్నారు. కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేసిన శ్రేణులకు న్యాయం చేసేందుకు కులాలవారీగా బ్యాలెన్సు చేసుకుని జాబితా తయారు చేయాలని అధిష్ఠానం సూచించింది. ఆ మేరకు ఎమ్మెల్యేలు జాబితాలు సిద్ధం చేస్తున్నారు.
ఫ పూతలపట్టు నియోజకవర్గంలో సుప్రసిద్ధ కాణిపాకం, అరగొండ అర్ధగిరి ఆలయం, బంగారుపాళ్యంలో మొగిలీశ్వరాలయం ఉన్నాయి. ఈ మూడు చోట్ల కమిటీల నియామకానికి ఎమ్మెల్యే మురళీమోహన్ ఆయా మండలాల నాయకులతో చర్చించి జాబితా సిద్ధం చేశారు. అధిష్ఠానానికి కూడా పంపించేసినట్లు సమాచారం.
ఫ చిత్తూరులో గిరింపేట దుర్గమ్మ, దొడ్డిపల్లె సప్తకన్నికలమ్మ, కోదండరామస్వామి దేవాలయం, అగస్తీశ్వర కామాక్షీ సమేత ఆలయం, శివ షణ్ముగ ఆలయం, సుందర వినాయకస్వామి దేవస్థానం, వీరాంజనేయస్వామి దేవస్థానం, వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానం, తేనెబండ ముత్యాలమ్మ దేవస్థానం, పొన్నియమ్మ ఆలయం, కట్టమంచి కులందీశ్వరాలయం, కాశీ విశ్వేశ్వరాలయం (రాజుగుడి) వంటి ఆలయాలున్నాయి. వీటన్నింటికీ కమిటీలను నియమించేందుకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆయా డివిజన్ల ఇన్‌చార్జుల అభిప్రాయాలు తీసుకుని కసరత్తు చేస్తున్నారు.
ఫ జీడీనెల్లూరు నియోజకవర్గం విషయానికొస్తే.. కార్వేటినగరం మండలంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, ఎస్‌ఆర్‌పురం మండలంలోని ఆరిమాకులపల్లె గంగమ్మ గుడి ఉన్నాయి. ఎమ్మెల్యే థామస్ ఆధ్వర్యంలో గంగమ్మగుడి కమిటీ నియామకానికి జాబితా సిద్ధం చేయగా, సుబ్రహ్మణ్యస్వామి ఆలయం విషయంలో చర్చలు జరుగుతున్నాయి. పెనుమూరు మండలంలోని కలిగిరి కొండ వెంకటేశ్వరస్వామి ఆలయం టీటీడీ పరిధిలో ఉండడంతో దానికి పాలకవర్గం నియమించడం లేదు.
ఫ పలమనేరు నియోజకవర్గంలో పలమనేరులోని తిరుపతి గంగమ్మ గుడి, కాశీవిశ్వేశ్వరాలయం, సత్య గంగమ్మ గుడి, బైరెడ్డిపల్లెలోని ధ్యానాభిరామ ఆలయం (కార్వేటికొండ) ఉన్నాయి. ఇంకా పాలకవర్గాల జాబితా తయారీకి కసరత్తు ప్రారంభం కాలేదు. నేడో రేపో ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆధ్వర్యంలో జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఫ పుంగనూరు నియోజకవర్గంలో శక్తిక్షేత్రంగా పేరొందిన బోయకొండ గంగమ్మ ఆలయం, పుంగనూరులోని నెక్కుంది అగస్తీశ్వర స్వామి ఆలయం, చౌడేపల్లెలోని మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జాబితా తయారీ పనులు జరుగుతున్నాయి. రెండ్రోజుల్లో జాబితా సిద్ధం చేసి అధిష్ఠానానికి పంపిస్తామని చల్లా అంటున్నారు.
ఫ కుప్పంలో భిన్నంగా జాబితాల తయారీ
కుప్పం నియోజకవర్గంలో జాబితా తయారీ భిన్నంగా జరుగుతోంది. ఎమ్మెల్యేలున్న చోట్ల వారే నేరుగా జాబితా తయారుచేసి పంపిస్తుండగా.. కుప్పంలో మాత్రం ఒక్కో ఆలయానికి మూడు జాబితాలను సిఫారసు చేశారు. కుప్పంలోని గంగమ్మ ఆలయం, గుడుపల్లెలోని గుడివంక సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలకు మూడేసి చొప్పున జాబితాలను తయారుచేసి సీఎం బ్యాక్ ఆఫీసుకు పంపించారు. చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యే హోదాలో మూడు పేర్ల నుంచి ఓ పేరును ఎంపిక చేయనున్నారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునితర్నం ఆధ్వర్యంలో జాబితాలు తయారయ్యాయి.