ఒంటరి ఏనుగు దాడిలో మహిళకు గాయాలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:57 AM
ఒంటరి ఏనుగు దాడి చేయడంతో ఓ మహిళ కాలు విరిగిందని డీకేచెరువు గ్రామస్థులు తెలిపారు.

యాదమరి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ఒంటరి ఏనుగు దాడి చేయడంతో ఓ మహిళ కాలు విరిగిందని డీకేచెరువు గ్రామస్థులు తెలిపారు. స్థానికుల కథనం మేరకు.. యాదమరి మండల పరిధిలోని దిగువ కణతలచెరువు గ్రామానికి చెందిన సంపూర్ణ (55) మానసిక స్థితి సరిగా లేని కారణంగా మంగళవారం రాత్రి గ్రామ సమీపంలోని (తమిళనాడు) సరిహద్దు అటవీ ప్రాంతంలోకి వెళ్లగా ఒంటరి ఏనుగు చేసిన దాడిలో కాలు విరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లగా అటవీ ప్రాంతంలో కేకలు విని అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. కంపల్లి బీట్ అటవీశాఖ ఎఫ్‌బీవో సతీష్ సిబ్బంది గాయపడ్డ మహిళను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అటవీశాఖ అధికారి ఎఫ్‌ఆర్‌వో థామస్ మాట్లాడుతూ తమిళనాడు సరిహద్దు, బోడబండ్ల బీట్‌లో ఒంటరి ఏనుగు సంచరిస్తున్న నేపథ్యంలో రాత్రిపూట అటవీ ప్రాంతంలో ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.ఐదు వేల నగదు అందజేశారు.