టీటీడీ ఇళ్ల పట్టాల్లో జగన్ బొమ్మ మాకెందుకు?
ABN , Publish Date - Feb 15 , 2025 | 01:50 AM
ఇటు పక్క తిరుమలలోని ఆనంద నిలయం, వేంకటేశ్వరస్వామి ఫొటో. అటువైపు జగన్ బొమ్మ చుట్టూ నవరత్నాల పేరుతో అందిస్తున్న పథకాలను ముద్రించారు.

ఉద్యోగుల్లో అసంతృప్తి
శ్రీవారి బొమ్మతో కొత్తవి ఇచ్చే యోచనలో టీటీడీ
తిరుపతి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇటు పక్క తిరుమలలోని ఆనంద నిలయం, వేంకటేశ్వరస్వామి ఫొటో. అటువైపు జగన్ బొమ్మ చుట్టూ నవరత్నాల పేరుతో అందిస్తున్న పథకాలను ముద్రించారు. ఇదీ గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలోని చిత్రాలు. ఇలా, శ్రీవారితో సమానంగా అప్పటి సీఎం జగన్ ఫొటో ముద్రించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయినా అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పట్టించుకోలేదు. తమ ఇళ్ల పట్టాలకు సంబంధించి ప్రొసీడింగ్స్ కాపీపై జగన్ బొమ్మ ఎందుకంటూ టీటీడీ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు జగన్ బొమ్మను తీసేసి శ్రీవారి ఫోటోను ముద్రించి పాత ప్రొసీడింగ్స్ స్థానంలో కొత్తవి ఇచ్చే యోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం గ్రామంలోని 417.16 ఎకరాల వ్యవసాయ భూమిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. 5,350 మంది ఉద్యోగులకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీటిపై అప్పటి సీఎం జగన్ బొమ్మను ముద్రించడంపై విమర్శలు వచ్చాయి. పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు సిద్ధమైన టీడీపీ నేతలను అప్పట్లో పోలీసులు హౌస్ అరెస్టు కూడా చేశారు. గతంలో అనేకసార్లు టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాలు ఇచ్చినా.. ఎన్నడూ నేతల ఫొటోలు ముద్రించలేదు. కానీ, వైసీపీ హయాంలో సొమ్ము టీటీడీది, సోకు నాయకులది అన్న చందంగా వ్యవహరించారు. ప్రభుత్వం నుంచి తాము భూమి కొనుగోలు చేశామని, ఉచితంగా ఇవ్వలేదని, అలాంటప్పుడు ప్రొసీడింగ్స్‌పై జగన్ బొమ్మ ఎందుకని టీటీడీ ఉద్యోగులు గతంలోనే బాహాటంగా ప్రశ్నించినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి జగన్ బొమ్మలు ముద్రించారని విపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడా జగన్ బొమ్మలను తొలగించి, శ్రీవారి ఫొటోలతో కొత్తగా ప్రొసీడింగ్స్ ఇచ్చే ఉద్దేశంతో టీటీడీ ఉన్నట్లు సమాచారం.