Share News

టాస్క్‌ఫోర్సు ఏమైనట్లు?

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:50 AM

చంద్రగిరి మండలంలోని స్వర్ణముఖినది, భీమానది, దోసుళ్లు వంకలలో యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు.

టాస్క్‌ఫోర్సు ఏమైనట్లు?

యథేచ్ఛగా ఇసుక,

గ్రావెల్‌ అక్రమ రవాణా

ఫిర్యాదులపైనా

పట్టించుకోని అధికార యంత్రాంగం

ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్టకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్సు

ఏర్పాటు చేస్తున్నాం. రోజుకు ముగ్గురు వీఆర్వోల చొప్పున..

నిఘా పెట్టి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటాం.

- గత నెల 6వ తేదీన చంద్రగిరి తహసీల్దారు

శివరామసుబ్బయ్య చెప్పిన మాటలివి. క్షేత్రస్థాయికి వచ్చేసరికి

ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణా సాగుతూనే ఉంది.

- చంద్రగిరి, ఆంధ్రజ్యోతి

చంద్రగిరి మండలంలోని స్వర్ణముఖినది, భీమానది, దోసుళ్లు వంకలలో యంత్రాలతో ఇసుక తవ్వేస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో.. తమ అవసరాలకు ఎవరైనా ఎక్కడైనా ఇసుక తీసుకోవచ్చు. కాకుంటే మనుషుల ద్వారా తవ్వి పోసుకోవాలన్నది నిబంధన. ఇక్కడా నిబంధనల అమలు కావడంలేదు. ఎటుచూసినా ఎక్స్‌కవేటర్లతో తవ్వడాలే. ప్రధానంగా స్వర్ణముఖి నదిలో నరసింగాపురం వద్ద, రెడ్డివారిపల్లె, చంద్రగిరి-శ్రీనివాసమంగాపురం బ్రిడ్జి వద్ద, చంద్రగిరి బ్రహ్మంగారిగుడి, కేశవరెడ్డి స్కూల్‌ వద్ద, పాతశానంబట్ల, దోర్నంకబాల వద్ద దోసుళ్లు వంక, తొండవాడ ఎన్టీఆర్‌ కాలనీ వద్ద, భీమానదిలో ఎ.రంగంపేట, భీమవరం, నారావారిపల్లె తదితర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. దీనిపై సమాచారం ఇస్తే చేస్తే ‘వెంటనే దాడులు చేస్తాం’ అనే సమాధానం తప్ప రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చెబుతున్నారు. ఒక వేళ దాడులు చేస్తే చంద్రగిరిలో పలుకుబడిన ఉన్న నాయకుల ట్రాక్టర్లు, టిప్పర్లు, ఎక్స్‌కవేటర్లను వదిలేసి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలను సీజ్‌ చేసి చేతులు దులుపుకొంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఎ.రంగంపేట పంచాయతీ దర్శిపల్లి వద్ద గ్రామానికి ఆనుకొనే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, సర్పంచ్‌ ఎర్రయ్య రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎ.రంగంపేట వద్ద భీమానది నుంచి భాకరాపేట, పులిచెర్ల, కొత్తపేటకు ఇసుక టిప్పర్ల ద్వారా తరలిపోతుంది. చంద్రగిరి, పాతశానంబట్లకు చెందిన ఇసుక అక్రమ దారులు టిప్పర్ల ద్వారా భారీగా మామిడి తోటల్లో డంపులు ఏర్పాటు చేసి, తిరుపతికి తరలిస్తున్నారు. ఇక, గంగుడపల్లె, చిన్నరామాపురం వద్ద చెరువులో నుంచి యధేచ్చగా గ్రావెల్‌ అక్రమ రవాణా జరుగుతుంది. దీనికి డూప్లికట్‌ బిల్లులు చూపిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు స్పంధించి ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణాలను అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, గత ప్రభుత్వంలోనూ ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారే.. ఇప్పుడూ ఇసుక తవ్వేస్తున్నారన్న విమర్శలున్నాయి.

అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిందెవరు?

ఇసుక, గ్రావెల్‌ అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికారులు ఎవరనేది ప్రజల్లో వ్యక్తమవుతున్న సందేహం. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తే.. తమకు సంబంధం లేదంటూ, ఒక్కోసారి తూతూమంత్రంగా చర్యలు చేపడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఇక, మండలంలో మైనింగ్‌శాఖ అధికారులు దాడులు చేసిన సంఘటనలు లేదు. పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నా, కొన్ని వాహనాలు మాత్రమే పట్టుకుని సీజ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 01:50 AM