Share News

స్వచ్ఛాంధ్ర మిషన్‌లో వెనుకబడ్డాం

ABN , Publish Date - Feb 15 , 2025 | 02:04 AM

స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు చేపట్టిన స్వచ్ఛాంధ్ర మిషన్‌లో చిత్తూరు జిల్లా పూర్తిగా వెనుకబడింది. శుక్రవారం స్వచ్ఛాంధ్ర మిషన్‌ అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

స్వచ్ఛాంధ్ర మిషన్‌లో వెనుకబడ్డాం

88పాయింట్లతో 25వ స్థానంలో నిలిచిన చిత్తూరు

చిత్తూరు, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలు చేపట్టిన స్వచ్ఛాంధ్ర మిషన్‌లో చిత్తూరు జిల్లా పూర్తిగా వెనుకబడింది. శుక్రవారం స్వచ్ఛాంధ్ర మిషన్‌ అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత కార్యక్రమాల అమలులో జిల్లాలు సాధించిన ర్యాంకులను ప్రకటించారు. మున్సిపల్‌ పట్టణాలు, నగరాలు, గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటింటి నుంచీ చెత్త సేకరణ, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్‌ టాయిలెట్లు, కమ్యూనిటీ సోక్‌పిట్స్‌, ఓడీఎఫ్‌ ప్లస్‌ మోడల్‌ తదితర 14 ప్రాధాన్యతా అంశాలను తీసుకుని అన్నింటికీ కలిపి 200 పాయింట్లు నిర్ణయించింది ప్రభుత్వం. ఈ 200 పాయింట్లకు గానూ జిల్లాలు సాధించిన పాయింట్లను బట్టి ర్యాంకులు నిర్ణయించింది. 26 జిల్లాలతో కూడిన ఈ జాబితాలో చిత్తూరు జిల్లా 88 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచింది. మొదటి ర్యాంకు సాధించిన ఎన్టీయార్‌ విజయవాడ జిల్లాకు 129 పాయింట్లు రాగా దానికీ చిత్తూరు జిల్లాకు నడుమ తేడా ఏకంగా 41 పాయింట్లు వుండడం గమనార్హం. రాయలసీమ విషయానికొస్తే 122 పాయింట్లతో అనంతపురం జిల్లా మొదటి స్థానంలోనూ, 120 పాయింట్లతో అన్నమయ్య జిల్లా రెండవ స్థానంలోనూ, 118 పాయింట్లతో కడప జిల్లా మూడవ స్థానంలోనూ నిలవగా తిరుపతి జిల్లా 111 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

Updated Date - Feb 15 , 2025 | 02:04 AM