నీరు - చెట్టు బిల్లులకు మోక్షం
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:48 AM
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నీరు - చెట్టు బిల్లుల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

-రూ.160 కోట్ల మంజూరుకు మంత్రివర్గ ఆమోదం
చిత్తూరు సిటీ/చిత్తూరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి):ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నీరు - చెట్టు బిల్లుల మంజూరుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.వీటిలో నీరు - చెట్టు బిల్లుల మంజూరు, ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న 386 మంది ఇంజనీర్లపై చర్యల ఉపసంహరణ తదితరాలున్నాయి. ఇందులో మన జిల్లాకు సంబంధించి గత ఐదేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న నీరు - చెట్టు బిల్లులు సుమారు రూ.160 కోట్లు మంజూరు కానున్నాయి.2015-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం జలసంరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి కోసం నీరు-చెట్టు పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. చెక్ డ్యాముల మరమ్మతులు, కొత్తవాటి నిర్మాణం, చెరువుల అభివృద్ధి, జంగిల్ క్లియరెన్సు, కాలువల పునరుద్ధరణ వంటి జలసంరక్షణ పనులు ఈ కార్యక్రమం కింద జరిగాయి.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం ద్వారా రూ.650.28 కోట్ల విలువైన 5,978 పనులు మంజూరయ్యాయి. వీటిలో రూ.366.26కోట్ల అంచనాతో 3,697 పనులు దశలవారీగా పూర్తయ్యాయి. వీటిలో 3068 చెక్‌డ్యాం పనులు, 304 సరఫరా కాలువల పనులు, 180 జంగిల్ క్లియరెన్సు పనులు, 2,430 చెరువుల అభివృద్ధి పనులను చేశారు.వైసీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చాక అంతవరకు అమలైన అన్ని పథకాలనూ రద్దు చేసిన విషయం తెలిసిందే. నీరు-చెట్టుకు సంబంధించి కూడా రూ.120 కోట్ల విలువ చేసే 713 పనులను రద్దు చేసింది. పూర్తయిన పనులకు సంబంధించిన బిల్లులను కూడా విజిలెన్సు విచారణ పేరుతో ఆపేశారు.దీనిపై కోర్టుకు వెళ్లిన కొంతమంది కాంట్రాక్టర్లకు మాత్రం రూ.20 కోట్ల వరకు బిల్లులు చెల్లించారు. మిగిలిన వారంతా బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోయారు.ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిల్లుల్ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయడం మొదలెట్టింది. రూ.20 కోట్లను విడుదల చేసింది కూడా.ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు- చెట్టు కార్యక్రమానికి సంబంధించిన మిగిలిన బిల్లుల్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయండంటూ ఆదేశాలు జారీ చేయడంతో కాంట్రాక్టర్ల ఆశలు చిగురించాయి.మంత్రి ఆదేశాలతో ఉమ్మడి చిత్తూరు జిల్లావ్యాప్తంగా పెండింగులో ఉన్న బిల్లుల్ని చిత్తూరులోని జలవనరుల శాఖ ఎస్‌ఈ కార్యాలయంలో అప్‌లోడ్ చేసే ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా మంత్రివర్గ నిర్ణయంపై బిల్లులు రాక తీవ్రంగా నష్టపోయిన కాంట్రాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇరిగేషన్ శాఖలో వివిధ పనులకు సంబంధించి సుమారు 30 మంది ఇంజనీర్లపై తీసుకున్న చర్యలను ఉపసంహరించుకోవడానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.