‘తొక్కిసలాట’పై నేడు విజయవాడ నుంచి వర్చువల్ విచారణ
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:08 AM
వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సోమవారం విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి బాధితులను విచారించనున్నారు.

తిరుపతి(కలెక్టరేట్), ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి సోమవారం విజయవాడ నుంచి వర్చువల్ విధానంలో జస్టిస్ సత్యనారాయణమూర్తి బాధితులను విచారించనున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. తిరుపతి కలెక్టరేట్ వేదికగా కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాణమూర్తి శనివారం రెండో దశ విచారణ చేపట్టారు. 11 మందిని విచారించారు. ఇదే ఘటనలో విశాఖకు చెందిన కొందరు మృతిచెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. విచారణకు హాజరు కావాలని ఈ ప్రాంతానికి చెందిన 19 మంది బాధితులకు న్యాయవిచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయితే తామింకా కోలుకోలేదని గాయాలు ఇబ్బంది పెడుతున్నాయని, అంత దూరం రాలేమని వర్చువల్(జూమ్) మీటింగ్‌లో పాల్గొని ఘటపై వివరిస్తామని వారు కమిషన్‌కు లిఖితపూర్వకంగా వివరణ పంపించారు. దీంతో జస్టిస్ సత్యనారాయణమూర్తి ఆదివారం ఉదయం విజయవాడకు బయలుదేరి వెళ్లిపోయారు. సోమవారం ఉదయం వైజాగ్ గోపాలపట్టణం తహసీల్దారు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో న్యాయవిచారణ కమిషన్ ఎదుట బాధితులు హాజరు కానున్నారు. విజయవాడ నుంచి వర్చువల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి వారిని విచారించనున్నారు. కాగా, ఈ తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారిలో కొందరు కేరళ, తమిళనాడుల్ల రాష్ట్రాల్లో ఉన్నారు. వీరూ వర్చువల్ విధానంలో విచారణకు హాజరుకానున్నట్లు తెలిసింది. దీని తర్వాత మూడో దశ విచారణ కీలకం కానుంది.