కుటుంబ కలహాలకు ఇద్దరు చిన్నారుల బలి
ABN , Publish Date - Jan 12 , 2025 | 01:44 AM
కుటుంబ కలహాలకు ఇద్దరు చిన్నారుల జీవితాలు బలైపోయాయి. ఆవేశంలో పిల్లల కన్నతల్లి తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో శాశ్వత విషాదాన్ని నింపింది.

- పిల్లలతో కలసి బావిలో దూకిన తల్లి
- తల్లిని కాపాడగలిగిన గ్రామస్తులు
- అప్పటికే పిల్లలిద్దరూ మృత్యువాత
నగరి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాలకు ఇద్దరు చిన్నారుల జీవితాలు బలైపోయాయి. ఆవేశంలో పిల్లల కన్నతల్లి తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో శాశ్వత విషాదాన్ని నింపింది.పోలీసుల కథనం మేరకు... నగరి మున్సిపాలిటీ పరిధిలోని భీమానగర్‌కు చెందిన దేవి (33)కి, చెన్నైలోని వెస్ట్ మాంబళానికి చెందిన ధనంజయులుతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఐశ్వర్య (10), అక్షర (3) అనే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు.కుటుంబ కలహాల కారణంగా గురువారం దేవి నగరిలోని పుట్టింటికి వచ్చేసింది. శుక్రవారం ఏకాంబరకుప్పం సమీపంలో వున్న సాళ్వపట్టెడలోని పెదనాన్న ఇంటికి వెళ్లి వస్తానని దేవి ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లింది. అయితే ఆమె తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు సాళ్వపట్టెడలోని బంధువులను విచారించారు.జాడ తెలియకపోవడంతో పోలీసులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేశారు.సాయంత్రం సాళ్వపట్టెడ సమీపంలోని పొలాల నుంచి ఆవులు తోలుకు వస్తున్న వ్యక్తులకు అక్కడున్న బావినుంచి శబ్దాలు వినిపించాయి.బావి దగ్గరకు వెళ్లి చూడగా తాడుపట్టుకొని వేలాడుతున్న దేవి కన్పించింది.వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అందరూ కలసి ఆమెను పైకిలాగి ఆస్పత్రికి తరలించారు. పిల్లలకోసం గాలించి రాత్రి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బావినుంచి బయటకు తీశారు.నగరి సీఐ మహేశ్వర్ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు.