Share News

‘సీసీ’ నిఘాలో తిరుపతి!

ABN , Publish Date - Mar 07 , 2025 | 02:00 AM

ఆధ్యాత్మిక క్షేత్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది.

‘సీసీ’ నిఘాలో తిరుపతి!

తిరుపతి(నేరవిభాగం), మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక క్షేత్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. దశలవారీగా తిరుపతి నగరాన్ని సీసీ కెమెరాల నిఘాలోకి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసింది. తొలుత ముఖ్యప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండు చుట్టు పక్కల, పెద్దకాపులేఅవుట్‌ ప్రాంతాల్లో దాదాపు 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌లో జీపులు, ఆటోల కట్టడికి, అసాంఘిక శక్తులపై నిఘాకు మరో 10 సీసీ కెమెరాలు అమర్చారు. కర్నాల వీధి నుంచి పూర్ణకుంభం సర్కిల్‌ వరకు ప్రతి 100 మీటర్లకు ఒక శక్తిమంతమైన కెమెరా, ఎప్పుడూ తిరుగుతూ ఉండేలా ఏర్పాటు చేశారు. మరోవైపు దేశ విదేశాల నుంచి తిరుమలకు కాలినడకన, వాహనాల్లో భక్తులు వెళుతుంటారు. టీటీడీ ఉద్యోగులు, స్థానికులు కొందరు ద్విచక్ర వాహనాలు, కార్లు, జీపులను అలిపిరి వద్ద పార్కింగ్‌ చేసి కొండకు వెళుతుంటారు. ఇటీవల అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్సు, లింక్‌ బస్టాండును అడ్డాగా చేసుకుని విచ్చలవిడిగా చోరీలు, పిక్‌ ప్యాకెట్లు, భక్తులను వివిధ రకాలుగా మోసగించి డబ్బులు లాక్కోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటిని దృష్టిలో వుంచుకుని ఎస్పీ హర్షవర్ధనరాజు.. తాజాగా భూదేవి కాంప్లెక్సు వద్ద మరో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. తిరుపతిలో ట్రాఫిక్‌ నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా, రౌడీలు, ఆకతాయిల ఆటకట్టించడం, విద్యార్థినులకు రక్షణ, నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం వంటి కార్యకలాపాలను అడ్డుకోవడానికి రెండో దశలో అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని రోడ్లు, రద్దీ కూడళ్లు, ప్లైఓవర్‌పై శక్తిమంతమైన కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్‌ సిటీ నిధుల కింద వీటిని కొనుగోలు చేయనున్నారు. ఇలా ఆయా శాఖల సమన్వయంతో నగరమంతటా సీసీ కెమెరాలను అమర్చనున్నారు. దీంతో ఆధ్యాత్మిక క్షేత్రం పూర్తిగా సీసీ నిఘాలోకి రానుంది.

Updated Date - Mar 07 , 2025 | 02:00 AM