యంత్రాలతో తోడేస్తున్నారు
ABN , Publish Date - Feb 23 , 2025 | 02:29 AM
ఎక్స్‌కవేటర్లు, హిటాచీలు చేసే శబ్ధాలు. ఒక్కొక్కటిగా వచ్చే టిప్పర్లు. ఇవీ తిరుపతి రూరల్ మండలంలోని స్వర్ణముఖీ నది పరివాహక ప్రాంతంలో కనిపించే దృశ్యాలు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వి తరలించేందుకు జరిగే పనులివి. నదిలోని ఇసుకను తవ్వితీసి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లలో నింపుకుని తరలించి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక మంచి ఇసుక దొరికేచోట్ల పరిధికి మించి జేసీబీ సాయంతో తవ్వేస్తుండడంతో నది రూపురేఖలు కోల్పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా పేట్రేగిపోయిన ఇసుక మాఫియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే తరహాలో ఇష్టారాజ్యంగా రేయింబవళ్లు ఇసుక తోడేసి అనధికారికంగా విక్రయిస్తున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల అవసరాల కోసం ట్రాక్టర్ల ద్వారా మనుషులతో తవ్వి.. ఇసుకని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఇసుక రీచ్‌లు లేనిచోట్ల నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు.

రీచ్‌లు లేకున్నా.. ఎక్కడైనా ఇసుక తీసుకోవచ్చు. అయితే, మనుషులతో తవ్వి ట్రాక్టర్లలో మాత్రమే ఉచితంగా తీసుకెళ్లాలి. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ ఉచిత ఇసుక విధానంలో నిబంధన. దీనిని కొందరు ఉల్లంఘిస్తున్నారు. యంత్రాలతో ఇసుక తవ్వి.. పెద్దపెద్ద టిప్పర్లలో ఇసుక తరలించేస్తున్నారు.
- తిరుపతి రూరల్, ఆంధ్రజ్యోతి
ఎక్స్‌కవేటర్లు, హిటాచీలు చేసే శబ్ధాలు. ఒక్కొక్కటిగా వచ్చే టిప్పర్లు. ఇవీ తిరుపతి రూరల్ మండలంలోని స్వర్ణముఖీ నది పరివాహక ప్రాంతంలో కనిపించే దృశ్యాలు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వి తరలించేందుకు జరిగే పనులివి. నదిలోని ఇసుకను తవ్వితీసి నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లలో నింపుకుని తరలించి అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక మంచి ఇసుక దొరికేచోట్ల పరిధికి మించి జేసీబీ సాయంతో తవ్వేస్తుండడంతో నది రూపురేఖలు కోల్పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా పేట్రేగిపోయిన ఇసుక మాఫియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అదే తరహాలో ఇష్టారాజ్యంగా రేయింబవళ్లు ఇసుక తోడేసి అనధికారికంగా విక్రయిస్తున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల అవసరాల కోసం ట్రాక్టర్ల ద్వారా మనుషులతో తవ్వి.. ఇసుకని ఉచితంగా తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఇసుక రీచ్‌లు లేనిచోట్ల నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ నుంచి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టారు. దీన్ని బేఖాతరు చేస్తూ అనధికారికంగా యంత్రాల సాయంతో ఇసుక తోడేస్తున్నారు. చిగురువాడ గ్రామ దక్షిణపుకండ్రిగ రెవెన్యూ లెక్కదాఖలాలో సి.గొల్లపల్లె నుంచి దుర్గసముద్రం గ్రామానికి వెళ్లే లింకురోడ్డుకు తూర్పు దిశగా, సర్వే నంబరు219కు దక్షిణం వైపు స్వర్ణముఖి నదిలో విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నారు. అలాగే గొల్లపల్లె, దుర్గసముద్రం, పైడిపల్లె, అడపారెడ్డిపల్లె, కేసీపేట, తనపల్లె తదితర పంచాయతీల్లో నదిలోకి దారులను ఏర్పాటు చేసుకుని టిప్పర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారని సమాచారం. ఈ నది పరివాహక ప్రాంతంలో గతంలో కొందరు పేదలకు నియమ, నిబంధనల మేరకు సాగు చేసుకునేందుకు లీజు పట్టాలను మంజూరు చేశారు. దీనిలో ఇసుక తరలించేందుకు ఎలాంటి హక్కులూ కల్పించలేదు. కొందరు ఇదే అదునుగా తప్పుడు రికార్డులు సృష్టించుకుని, ఈ భూమిపై తాము హక్కు కలిగి ఉన్నామని చెబుతూ.. ఎక్స్‌కవేటర్ల సాయంతో ఇసుకను తవ్వితీసి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. పట్టపగలే యథేచ్ఛగా ఇసుకను టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునేవారు కరువయ్యారని గ్రామస్తులు అంటున్నారు. కాగా వైసీపీ ప్రభుత్వంలో అప్పటి పాలకులు ఇక్కడ ఇసుక రీచ్‌ని పెట్టేందుకు ప్రయత్నించగా స్థానికులతోపాటు సమీపంలోని గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. అలాగే స్వర్ణముఖి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుక తరలింపును నిషేధించాలని చిగురువాడ గ్రామసభల్లోనూ ప్రత్యేక తీర్మానం చేశారు. జలవనరులు, భూగర్భశాఖ అధికారులు ఈ ప్రాంతాన్ని డ్రౌట్ ఏరియాగా గుర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే నదిలోని ఇసుకుని ఇదేవిధంగా తరలిస్తూ పోతే రానున్న రోజుల్లో నీటి ఎద్ద డి ఏర్పడే ప్ర మాదం ఉందని, దీన్ని ప్రభుత్వ భూమిగా గుర్తించాలని కోరుతున్నారు. అలాగే నదిప్రాంతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి నియమ, నిబంధనల మేరకే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
యంత్రాలతో తవ్వితే చర్యలు
ఎక్కడి నుంచైనా ఇసుక తీసుకోవచ్చు. మనుషులతో మాత్రమే తవ్వుకుని ట్రాకర్ల ద్వారా తీసుకెళ్లాలి. యంత్రాలతో నదిలోని ఇసుకని తవ్వితీసి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో స్థానిక రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా యంత్రాల సాయంతో ఇసుక తవ్వుతున్నారని తెలిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేదిలేదు.
- రామాంజులునాయక్,
తిరుపతి రూరల్ తహసీల్దార్