Share News

చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలెన్నో

ABN , Publish Date - Mar 01 , 2025 | 02:19 AM

ఏసీబీకి చిక్కిన చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్యపై గతంలోనూ ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి.

చంద్రగిరి పంచాయతీ కార్యదర్శిపై ఆరోపణలెన్నో

రూ.50 వేల లంచం తీసుకొంటూ ఏసీబీకీ చిక్కిన మహేశ్వరయ్య

చంద్రగిరి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): ఏసీబీకి చిక్కిన చంద్రగిరి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్యపై గతంలోనూ ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. రూ.6 లక్షల బిల్లుల మంజూరుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ శుక్రవారం పట్టుబడిన ఈయన.. గతంలో పడమటి మండలాల్లో పనిచేశారు. 2022 జూన్‌లో కుప్పం నుంచి బదిలీపై చంద్రగిరికి వచ్చారు. అప్పట్లోనే చంద్రగిరి ఇందిరమ్మ కాలనీ భూకబ్జాదారులకు అక్రమంగా ఎన్‌వోసీలు ఇవ్వడం, ఇంటి ప్లానింగ్‌ అప్రూవల్‌ ఇవ్వడం.. వంటి ఘటనల్లో ఈయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కూటమి అధికారంలోకి రాగానే బదిలీపై వెళతారనే ప్రచారం జరిగింది. అయినా, తన పలుకుబడితో ఇక్కడే కొనసాగుతున్నారు. తిరుచానూరుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకం బిల్లులకు సంబంధించి ఏసీబీకి చిక్కారు. చిన్నగొట్టిగల్లు మండలం పాలెం గ్రామానికి చెందిన కాంట్రాక్టర్‌ దినే్‌షరెడ్డి.. గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం కింద చంద్రగిరి పంచాయతీలో సచివాలయం, వెల్‌నెస్‌ సెంటర్‌ భవనాలను నిర్మించారు. గత నెలలోనే ఈయనకు రూ.6 లక్షల బిల్లులు మంజూరయ్యాయి. దీనికి పంచాయతీ కార్యదర్శి మహేశ్వరయ్య రూ.50 వేలు డిమాండు చేశాడు. దీనిపై ఆయన ఏసీబీ అధికారులను సంప్రదించారు. శుక్రవారం దినే్‌షరెడ్డి నుంచి కార్యదర్శి రూ.50 వేలు తీసుకొంటుండగా ఏసీబీ ఏఎస్పీ విమలకుమారి, డీఎస్పీ ప్రశాంతి, సీఐ మల్లికార్జున, సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ను అరెస్ట్‌ చేసి, నెల్లూరులోని ఏసీబీ స్పెషల్‌ కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.

ఏసీబీ దూకుడు

28 రోజుల్లో మూడు కేసులు

నలుగురు అధికారుల అరెస్టు

తిరుపతి ప్రాంతీయ అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు పెంచారు. 28 రోజుల వ్యవధిలో మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో నలుగురు అధికారులను నిఘావేసి పట్టుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన అధికారుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించేవారు. నేతలకు అనుగుణంగా ఉంటే చాలు.. ఎన్ని ఫిర్యాదులు వెళ్లినా.. ఏమీ కాదన్న భావన ఉండేది. అప్పట్లో వాళ్లంతా ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినా... కొందరు అధికారులు అదే పంథాను కొనసాగిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు పెంచారు. అంచాలు డిమాండ్‌ చేయడం.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టడం వంటి ఫిర్యాదులపై దృష్టి పెట్టారు. ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. మదనపల్లె మాజీ ఆర్డీవో మురళి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలో తిరుపతి ఏఎస్పీ విమలకుమారి, సిబ్బంది కలిసి గతేడాది నవంబరు 8న పలుచోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అత్యంత విలువైన డాక్యుమెంట్లు, నగదు, నగలు, కీలక పత్రాలు, వివిధ లావాదేవీలకు సంబంధించిన పాసు పుస్తకాలు సీజ్‌ చేశారు. ఈ కేసులో ఆర్డీవో మురళిని అరెస్టు చేశారు. ఇలా ఫిర్యాదులపై స్పందిస్తున్నారు. కాగా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌, ఆర్డీవో కార్యాలయాల నుంచి ఏసీబీకి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. తిరుపతి కార్పొరేషన్‌లోని ప్రణాళికా విభాగంలో నలుగురిపై కొందరు బాధితులు ఫిర్యాదులు చేసినట్లు తెలిసింది. వీటిపైనా ఏసీబీ దృష్టి పెట్టినట్లు సమాచారం.

- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 01 , 2025 | 02:19 AM