Share News

Revenue divisions: నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజనులో

ABN , Publish Date - Oct 31 , 2025 | 02:09 AM

ఇక నుంచి నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజనులో ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఒకే రెవెన్యూ డివిజన్‌ కింద ఒకటికి మించి నియోజకవర్గాలు.. ఒకే నియోజకవర్గంలోని మండలాలు కొన్ని ఒక డివిజనులో.. మరికొన్ని ఇంకో డివిజనులో వుండడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి.

Revenue divisions: నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజనులో
చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాలు

చిత్తూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇక నుంచి నియోజకవర్గమంతా ఒకే రెవెన్యూ డివిజనులో ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.ఒకే రెవెన్యూ డివిజన్‌ కింద ఒకటికి మించి నియోజకవర్గాలు.. ఒకే నియోజకవర్గంలోని మండలాలు కొన్ని ఒక డివిజనులో.. మరికొన్ని ఇంకో డివిజనులో వుండడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో నియోజకవర్గం పూర్తిగా ఒకే డివిజన్‌ పరిధిలో ఉండేలా కూటమి ప్రభుత్వం మార్పులు తీసుకురానుంది. చిత్తూరు జిల్లాలో కూడా ఆ మేరకు మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

ఏ డివిజన్లో ఏయే మండలాలు..

జిల్లాల విభజనకు ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి, మదనపల్లె రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉండేవి. విభజన తర్వాత చిత్తూరు పరిధిలో పలమనేరు, కుప్పం, నగరి కేంద్రాలను.. తిరుపతి ప్రాంతంలో శ్రీకాళహస్తిని రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు. కుప్పం డివిజన్‌లో ఆ నియోజవర్గంలోని నాలుగు మండలాలను, పలమనేరు డివిజన్‌లో అక్కడి ఐదు మండలాలతో పాటు పుంగనూరులోని నాలుగు, పూతలపట్టులోని ఓ మండలాన్ని జత చేశారు. నగరి కేంద్రంలో చిత్తూరు జిల్లా పరిధిలో ఉన్న మూడు మండలాలతో పాటు, జీడీనెల్లూరులోని రెండు మండలాలను చేర్చారు. ఇలా.. జిల్లా చిన్నదైనా ఏకంగా నాలుగు చిన్న చిన్న రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు.

వీటికి ఏ సమస్యా ఉండదు

ప్రభుత్వం అనుకున్న ప్రామాణికం మేరకు చూసుకుంటే కుప్పం, పలమనేరు, చిత్తూరు నియోజకవర్గాల్లోని మండలాలకు ఎలాంటి సమస్యా ఉండదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లోని మండలాలన్నీ అక్కడ ఒకే రెవెన్యూ డివిజన్లలో ఉన్నాయి. ఉదాహరణకు కుప్పం నియోజకవర్గంలో నాలుగు మండలాలు కుప్పంలో, పలమనేరు నియోజకవర్గంలో ఐదు మండలాలు పలమనేరులో, చిత్తూరు నియోజకవర్గంలో మూడు మండలాలు చిత్తూరు డివిజన్లోనే ఉన్నాయి. కానీ, పుంగనూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు, నగరి నియోజకవర్గాలు డిస్ట్రబ్‌ అవుతాయి.

నగరి వెళ్లినా.. నాలుగు డివిజన్‌లే..

ప్రభుత్వం తీసుకున్న ప్రామాణికాన్ని బట్టి ఇక నుంచి పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాలు పూర్తిగా ఒకే డివిజన్లో, అంటే చిత్తూరులో ఉండనున్నాయి. నగరి మూడు మండలాలతో సహా నగరి డివిజన్‌ తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోతుండడంతో.. నగరిలో ఐదు మండలాలూ ఒకే డివిజన్‌ కింద ఉంటాయి. మొత్తంగా జిల్లాలోని నగరి డివిజన్‌ తిరుపతిలోకి వెళ్లిపోతే, పుంగనూరు డివిజన్‌ కొత్తగా ఏర్పడుతుంది. అంటే మళ్లీ చిత్తూరు జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉంటాయి.


ఏ నియోజకవర్గం.. ఏ డివిజన్‌లోకి..!

ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గంలో ఆరు మండలాలుండగా.. రొంపిచెర్ల, పులిచెర్ల మండలాలు చిత్తూరు డివిజన్లో.. మిగిలిన నాలుగు పలమనేరు డివిజన్లో ఉన్నాయి. ఇక నుంచి పుంగనూరునే రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేసి ఆరు మండలాలనూ దాని పరిధిలోకి తీసుకురానున్నారు.

పూతలపట్టు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో బంగారుపాళ్యం ఒకటే పలమనేరు డివిజన్లో ఉంది. మిగిలిన నాలుగు మండలాలు చిత్తూరు పరిధిలో ఉన్నాయి. ఇక నుంచి అన్ని మండలాలూ చిత్తూరు డివిజన్‌లోనే ఉండనున్నాయి.

జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఆరు మండలాలుండగా.. పాలసముద్రం, కార్వేటినగరం మండలాలు కొత్తగా ఏర్పడిన నగరి డివిజన్లో ఉన్నాయి. మిగిలిన నాలుగు మండలాలు చిత్తూరు డివిజన్‌నే కొనసాగుతున్నాయి.

నగరి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో నగరి, విజయపురం, నిండ్ర నగరి డివిజన్లో ఉండగా. వడమాలపేట, పుత్తూరు.. శ్రీకాళహస్తిలో ఉన్నాయి.

Updated Date - Oct 31 , 2025 | 02:09 AM