అభివృద్ధి, సంక్షేమం సమతూకం ఇక పరుగులే
ABN , Publish Date - Mar 01 , 2025 | 02:14 AM
చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సమర్పించిన తొలి బడ్జెట్‌లో తిరుపతి జిల్లాకు ఘనమైన వాటా లభించింది.
చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం సమర్పించిన తొలి బడ్జెట్‌లో తిరుపతి జిల్లాకు ఘనమైన వాటా లభించింది. జగన్ జమానాలో చతికిలబడ్డ అభివృద్ధి మళ్లీ పరుగులు తీయనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలు మీద 2025-26 బడ్జెట్ అధిక దృష్టి పెట్టడంతో జిల్లా పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం పెరిగింది. నీటి ప్రాజెక్టులకు గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల మొత్తానికన్నా ఎక్కువ కేటాయించినా.. అవసరాలకు సరిపడేలా లేవు. వర్సిటీలకు నిధుల కేటాయింపులు కూడా ఆశాజనకంగా లేదు.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
వర్సిటీలు టాప్ 100లో నిలిచేదెలా?
ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ వంద యూనివర్సిటీలలో ఏపీ వర్సిటీలు ఉండేలా అభివృద్ధి పరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనకు తగ్గట్టుగా జిల్లాలో వర్సిటీలకు నిధుల కేటాయింపు జరగలేదు. పద్మావతీ మహిళా వర్శిటీకి గతేడాది వైసీపీ ప్రభుత్వం రూ.72.33 కోట్లు కేటాయించగా.. కూటమి ప్రభుత్వం రూ. 67.22 కోట్లు కేటాయించింది. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ వర్సిటీకి గతేడాది బడ్జెట్‌లో రూ.168 కోట్లు కేటాయించింది అప్పటి ప్రభుత్వం. అందులో రూ.113 కోట్లు జీతాలకు, రూ.40 కోట్లు కంటింజెన్సీ కింద ఇవ్వగా రూ. 15 కోట్లు సివిల్ వర్కులకు కేటాయించారు. ఇప్పుడు రూ.165 కోట్లు కేటాయించింది. ఉద్యోగుల జీతాలు, కంటెన్జెన్సీ నిధులు రూ.154కోట్లు, సివిల్ పనులకు 11కోట్లు కేటాయించారు. ఇక, ఎస్వీయూకు గతేడాది వైసీపీ ప్రభుత్వం రూ.226.38 కోట్లు కేటాయించగా.. ఇప్పుడూ అదే మొత్తాన్నీ ఇచ్చారు. విశ్వవిద్యాలయాలకు ఏటా బడ్జెట్ కేటాయింపుల్లో కనీసం పదిశాతం పెరుగుదల ఉంటేనే వర్సిటీల సాధారణ నిర్వహణ సాధ్యం కాని పరిస్థితి. ఈ కేటాయింపులతో గ్లోబల్ టాప్ 100 వర్సిటీల జాబితాలో చేరడం ఎలా సాధ్యమన్న ప్రశ్న వినిపిస్తోంది.
3647 మంది మత్స్యకారులకు రెట్టింపు లబ్ధి
చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం రూ.10 వేల నుంచీ రూ.20 వేలకు పెంచింది. తడ మండలంలో 1613 మంది, వాకాడులో 1045, చిల్లకూరులో 813, కోటలో 176 మంది చొప్పున 3647 మంది మత్స్యకారులున్నారు. వీరికి గత వైసీపీ ప్రభుత్వంలో రూ.10 వేల చొప్పున అందగా.. ఇప్పుడు రెట్టింపు లబ్ధి చేకూరనుంది.
శ్రీసిటీ ఐఐటీకి రూ. 19.52 కోట్లు
సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీ పరిధిలో ఏర్పాటు చేస్తున్న ఐఐటీకి ప్రభుత్వం రూ.19.52 కోట్లు కేటాయించింది. ఐఐటీ నిర్మాణానికి, ఇతర అవసరాలకు గతేడాది బడ్జెట్‌లో రూ. 39.04 కోట్లు కేటాయించగా నూతన బడ్జెట్‌లో రూ. 19.52 కోట్లు కేటాయించారు.
‘గంగ’కు పెంచినా.. అరకొరే
తెలుగుగంగ ప్రాజెక్టు పరిస్థితి కూడా అలానే వుంది. ఈ ప్రాజెక్టుకు గత వైసీపీ ప్రభుత్వం 2024-25లో రూ. 453.18 కోట్లు కేటాయించింది. కేవలం రూ.150 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుత ప్రభుత్వం రూ.345.48 కోట్లు కేటాయించింది. కండలేరు ప్రాజెక్టు మొదలుకుని, స్వర్ణముఖి బ్యారేజీ, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్, తెలుగు గంగ కాలువలు, తిరుపతికి తాగునీటి సరఫరా వరకూ పలు అంశాలు తెలుగు గంగ ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయి. తెలుగుగంగ కాలువలు పలుచోట్ల అసంపూర్తిగా వున్నాయి. గతంతో పోలిస్తే తెలుగు గంగకు రూ.200 కోట్లు ఎక్కువ ఇచ్చినా.. అవసరాల దృష్ట్యా ఈ కేటాయింపులు సరిపోవనే చెప్పాలి. ఈ నిధుల్లోనే ఎస్‌ఎస్ లింక్ కెనాల్‌కు రూ.69 కోట్లు కేటాయించాలి. అయితే గతేడాది వైసీపీ ప్రభుత్వం కేటాయించిన రూ.49 కోట్లతో పోలిస్తే రూ.20 కోట్లు అదనంగా ఇవ్వడం ఊరటనిచ్చే అంశం. స్వర్ణముఖి బ్యారేజీ అభివృద్ధికి నిధుల కేటాయింపు జరగకపోవడం గమనార్హం.
గాలేరు-నగరి.. అంతంత మాత్రమే
గాలేరు-నగరి ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు ఉసూరుమనిపించింది. 2024-25లో వైసీపీ ప్రభుత్వం రూ.2438.95 కోట్లు కేటాయించగా.. విడుదల చేసింది రూ.373.58 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.488.57 కోట్లు కేటాయించింది. వాస్తవానికి గాలేరు-నగరి ప్రాజెక్టు కడప జిల్లాలో పెండింగ్ పనులు పూర్తి చేయడానికే కనీసం రూ.1400 కోట్లు అవసరం. గండికోట ప్రాజెక్టు నుంచి తిరుపతి జిల్లాకు ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ డిజైన్ పనులకు మూడేళ్ల కిందటే రూ.5 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇప్పుడి రూ.6 వేల కోట్లకు చేరి ఉంటుంది. కొత్త బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కడప జిల్లాలో పెండింగు పనులకే చాలవు.
3.5 లక్షల మంది తల్లులకు వందనం
ఎన్నికల హామీల్లో భాగమైన తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం 1.65 లక్షల మంది పిల్లలకు అమ్మ ఒడిని అమలు చేయగా.. కూటమి ప్రభుత్వంలో ఆ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ కానుంది. 1,47,190 మంది ప్రభుత్వ, 1,55,784 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు.. 62,761 మంది ఇంటర్ విద్యార్థులు.. మొత్తంగా 3,65,735 మందికి రూ.15 వేలు చొప్పున ‘తల్లికి వందనం’ అందనుంది. వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో పిల్లలందరికీ రూ.15 వేలు ఇస్తామని, అధికారంలోకి వచ్చాక రూ.13 వేలు చొప్పున ఇంట్లో ఒక్కరికే ఇచ్చింది. అలాగే 2023-24 విద్యా సంవత్సరానికైతే పూర్తిగా ఎగ్గొట్టేసింది.