Share News

స్వామిత్వ.. ఒక భరోసా

ABN , Publish Date - Feb 24 , 2025 | 02:10 AM

గ్రామీణ ప్రాంత ప్రజల ఆస్తులకు సరైన ధ్రువపత్రాలు లేవన్న కారణంతో వారికి బ్యాంకర్లు రుణాలివ్వడం లేదు. వ్యవసాయ భూముల పాసుపుస్తకాలపై మాత్రమే అన్ని బ్యాంకులూ అప్పులిస్తున్నాయి. ఇల్లు తాకట్టు పెట్టుకుని రుణాలు పొందాలంటే సరైన పత్రాలు లేవని తిరస్కరిస్తున్నారు.

స్వామిత్వ.. ఒక భరోసా
వి.కోట మండలంలో జరుగుతున్న సర్వే

- గ్రామీణ ప్రజల ఆస్తులకు ధ్రువపత్రాలు

- బ్యాంకు రుణాలు, రిజిస్ట్రేషన్లకు తొలగనున్న ఇబ్బందులు

- వివాదాలు, చట్టపరమైన కేసులూ తగ్గుతాయి

గ్రామీణ ప్రాంత ప్రజల ఆస్తులకు సరైన ధ్రువపత్రాలు లేవన్న కారణంతో వారికి బ్యాంకర్లు రుణాలివ్వడం లేదు. వ్యవసాయ భూముల పాసుపుస్తకాలపై మాత్రమే అన్ని బ్యాంకులూ అప్పులిస్తున్నాయి. ఇల్లు తాకట్టు పెట్టుకుని రుణాలు పొందాలంటే సరైన పత్రాలు లేవని తిరస్కరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి పల్లెప్రజల ఆస్తుల విలువలను ధ్రువీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వామిత్వ’ (సర్వే ఆఫ్‌ విలేజస్‌ అబాది అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రొవైజ్డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సర్వే పూర్తయితే గ్రామాల్లోని ప్రజలకు తమ ఆస్తులు, భవనాలకు సంబంధించిన వివరాలు పక్కాగా ఉంటాయి. మరోవైపు రిజిస్ర్టేషన్ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఆదాయమూ వస్తుంది. వీటన్నింటితోపాటు కచ్చితమైన హద్దులు నిర్ణయించడంతో చాలావరకు వివాదాలు, చట్టపరమైన కేసులూ తగ్గుతాయి.

- చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి

గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలన్నీ గతంలో చాలావరకు గ్రామకంఠంగా అధికారులు నమోదు చేశారు. దీంతో గృహాలు నిర్మించుకున్నా.. రికార్డుల్లో మాత్రం అదే వివరాలు ఉంచేవారు. దీంతో ఇళ్లు, భవనాలు అమ్ముకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా సమస్యలు ఎదురయ్యేవి. వారసుల పేర్లపై బదలాయింపు చాలాకష్టంగా మారింది. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టాలని కేంద్రప్రభుత్వం స్వామిత్వ మొదలుపెట్టింది. కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వశాఖ ఇందుకు నిధులు సమకూరుస్తోంది. తొలుత రెవెన్యూ, సర్వే యంత్రాంగం ఆయా గ్రామాల సరిహద్దులు గుర్తిస్తుంది. అనంతరం చెరువులను, పాఠశాలలను, రహదారులను, పార్కులను, దేవాలయాలను, అంగన్వాడీ కేంద్రాలను, ప్రభుత్వ కార్యాలయాలను, ఆరోగ్య కేంద్రాలను సర్వేచేస్తారు. తద్వారా ప్రభుత్వ ఆస్తులపై పూర్తి స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ప్రజల గృహాలకు హద్దులు నిర్ణయిస్తారు.

ఏం చేస్తారంటే...?

సర్వే నిర్వహించే గ్రామంలో డ్రోన్‌ ద్వారా ప్రతి ఇంటికి సంబంధించిన ఫొటోలు తీస్తారు. ఇది పూర్తయ్యాక పంచాయతీరాజ్‌ సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి ఇంటి యజమాని పేరు, డోర్‌ నెంబరు, ఎప్పుడు ఇల్లు నిర్మించుకున్నారు.. వంటి వివరాలు సేకరిస్తారు. సచివాలయాల్లోని ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ ఇల్లు లేదా భవన విస్తీర్ణం ఎంత? ఖాళీ స్థలం ఎంత.. తదితర వివరాలు నమోదు చేసుకుంటారు.

గత ప్రభుత్వంలో తప్పిదాలు

వైసీపీ సర్కారు హయాంలోనే స్వామిత్వ కార్యక్రమం ప్రారంభమైంది. కొందరికి ఆస్తి ధ్రువపత్రాలు కూడా పంపిణీ చేశారు. అందులో అనేక తప్పిదాలు దొర్లాయి. యజమాని పేరు, ఫొటో కూడా సరిగ్గా ప్రచురితం కాలేదు. దీంతో భవనాలు, ఇళ్ల యజమానులు అష్టకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వామిత్వ ప్రాధాన్యాన్ని గుర్తించింది. ఎలాంటి పొరబాట్లు చేయకుండా సక్రమంగా కార్యక్రమాలను చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో గత ఏడాది డిసెంబరు చివరినుంచి పనులు పునఃప్రారంభమయ్యాయి.

ఆన్‌లైన్‌లోనూ చూసుకోవచ్చు

ఆస్తి ధ్రువపత్రాలు అందజేశాక ఆన్‌లైన్‌లోనూ నమోదు చేస్తారు. కుటుంబ అవసరాలకోసం విక్రయించాలనుకుంటే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు వెళ్లి ఇతరులకు అమ్ముకునే వీలుంటుంది. బ్యాంకుల నుంచి కూడా సులభంగా రుణాలు పొందవచ్చు. ఇప్పటివరకు జిల్లాలోని 70 గ్రామ పంచాయతీల్లో సర్వే పూర్తికాగా, మరో 30 గ్రామాల్లో సర్వే కొనసోగుతోంది.

ఫ జిల్లాలో సర్వే ఇలా..

మండలాలు : 31

పంచాయతీలు : 697

గ్రామీణ జనాభా : 18,76,761

సర్వే పూర్తయిన పంచాయతీలు : 70

జరుగుతున్న పంచాయతీలు : 30

జరగాల్సిన పంచాయతీలు : 597

Updated Date - Feb 24 , 2025 | 02:10 AM