‘సూపర్ సిక్స్’ అమలవుతుంది
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:14 AM
రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తుందని మంత్రి సత్యకుమార్‌యాదవ్ స్పష్టంచేశారు. వైసీపీ ప్రభుత్వంలో వెంటిలేటర్‌పైకి చేరిన రాష్ట్రానికి.. ఏడు నెలలుగా కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించి నడిపిస్తోందన్నారు.

కలిసి కట్టుగా రాక్షసపార్టీ ఉనికి లేకుండా చేద్దాం
‘కూటమి’ నేతలు, శ్రేణులకు మంత్రి సత్యకుమార్ యాదవ్
తిరుపతి(ఉపాధ్యాయనగర్), జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తుందని మంత్రి సత్యకుమార్‌యాదవ్ స్పష్టంచేశారు. వైసీపీ ప్రభుత్వంలో వెంటిలేటర్‌పైకి చేరిన రాష్ట్రానికి.. ఏడు నెలలుగా కూటమి ప్రభుత్వం ఆక్సిజన్ అందించి నడిపిస్తోందన్నారు. తిరుపతిలో బుధవారం జరిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుడి బాధ్యతల స్వీకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ మన బలాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. గత ఎన్నికల్లో కూటమికి 57 శాతం.. వైసీపీకి 39 శాతం వచ్చాయని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ 39 శాతాన్ని మనం కైవసం చేసుకునేలా కూటమి పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీలు వేరైనా ఒక్కటిగా పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో రాక్షస పార్టీ ఉనికి లేకుండా చేద్దామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట ఎక్కించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ‘ఈ ఏడు నెలల్లో పోలవరానికి కేంద్రం రూ.12వేల కోట్లు ఇచ్చింది. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం ఊపందుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రణాళికమేరకు కేంద్రం రూ.15 వేల కోట్లను రాజధానికి అందజేసింది. ప్రపంచం అబ్బురపడే రాజధాని ఎన్డీయే కాలంలోనే సాకారమవుతుంది’ అని మంత్రి తెలిపారు. ఇన్ని పనులు శరవేగంగా జరుగుతుంటే.. పెన్షన్ పెంపు, ఉచిత సిలిండర్లు ఇస్తుంటే.. ఇవన్నీ మర్చిపోయి కొందరు సూపర్ సిక్స్ అంటున్నారన్నారు. అవీ అమలవుతాయని స్పష్టంచేశారు. ఈ విషయంలో మన నాయకులు, కార్యకర్తలే మన ప్రభుత్వాన్ని విమర్శిస్తుండటం సరికాదన్నారు. ‘రాష్ట్రానికి చికిత్స జరుగుతోంది. త్వరలో అన్నీ చక్కబడతాయి. కూటమి కార్యకర్తలు, అభిమానులు కాస్తంత సంయమనం పాటించాలి’ అని కోరారు.