భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవు
ABN , Publish Date - Feb 26 , 2025 | 02:57 AM
శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరిక
తిరుమల, ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. టీటీడీ పీఆర్వో అని చెప్పుకొంటూ ప్రసాద్ అనే పేరుతో.. చైర్మన్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఎన్‌ఆర్‌ఐ భక్తులకు శ్రీవారి దర్శన టికెట్ల ఆశజూపి ఓ వ్యక్తి నగదు వసూలు చేస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఐ భక్తుడు గోపాల్‌రాజ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిని బీఆర్ నాయుడు తీవ్రంగా పరగణించి చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులను ఆదేశించారు.వింగ్ సిబ్బంది బాధితుడి నుంచి చేపట్టిన వివరాల ఆధారంగా నిందితుడు హైదరాబాదులోని ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలో నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్‌ఆర్‌ఐ భక్తుల నుంచి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ వారి నుంచి డబ్బు అందాక.. గ్రూప్ నుంచి రిమూవ్ చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈక్రమంలో శ్రీవారి భక్తులను మోసం చేసే ఏ ఒక్కరిని ఉపేక్షించమని, దళారులు, మోసగాళ్లపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. నకిలీ వెబ్‌సైట్లను, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దర్శనం, వసతి బుక్ చేసుకోవాలని కోరారు.