Share News

పుత్రశోకం

ABN , Publish Date - Mar 07 , 2025 | 01:56 AM

పుత్తూరు- చెన్నై జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ్ముడు దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన అన్న కూడా గురువారం అసువులు బాశారు.

పుత్రశోకం

‘పుత్తూరు’ ప్రమాదంలో

గాయపడిన పెద్ద కొడుకూ మృతి

శోకసంద్రంలో గట్టు గ్రామం

పుత్తూరు అర్బన్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): పుత్తూరు- చెన్నై జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ్ముడు దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన అన్న కూడా గురువారం అసువులు బాశారు. ప్రమాదంలో ఇద్దరు కొడుకులనూ పోగొట్టుకున్న తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. పుత్తూరు మండలం నేసనూరు పంచాయతీ గట్టు గ్రామానికి చెందిన రైతు మంజునాథ్‌ కుమారులు మునికుమార్‌(19), రవిశేఖర్‌(18) పుత్తూరులో డిగ్రీ చదువుతున్నారు. బుధవారం ద్విచక్ర వాహనంపై కళాశాలకు బయలుదేరగా.. పిల్లారిపట్టు సమీపంలో రాంగ్‌రూట్లో వస్తున్న ట్రాక్టరు ఢీకొన్న విషయం తెలిసిందే. రవి శేఖర్‌(18) ప్రమాద స్థలంలోనే మృతి చెందగా, తీవ్రగాయాలై మృత్యువుతో పోరాడిన మునికుమార్‌(19) గురువారం మధ్యాహ్నం అసువులు బాశారు. పిల్లలపై ఎంతో ప్రేమ పెంచుకుని, వారి ఉన్నతి కోసం కలలు కన్న తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చారు. ఇద్దరు కొడుకులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయారు. తాము సర్వం కోల్పోయామని గుండెలవిసేలా రోదించారు. ఒక్క కొడుకు మృతి చెందిన బాధ నుంచి తేరుకునేటప్పకే మరో కొడుకూ మృతి చెందాడన్న వార్త వారిని కుంగదీసింది. ప్రాణాలతో తిరిగి వస్తాడన్న భరోసాతో ఉన్న తల్లిదండ్రులకు మునికుమార్‌ విగతజీవిగా రావడంతో కన్నీరుమున్నీరయ్యారు. తమ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతితో గట్టులో విషాదం నెలకొంది. కాగా, బంధువుల సహకారంతో మునికుమార్‌కు ప్రైవేటు ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం రూ.12 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని పలుమార్లు పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని, పాత వందన వైన్స్‌ ప్రాంతంలో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాగా, మునికుమార్‌ మృతదేహంతో ధర్నా చేసేందుకు సిద్ధపడ్డారు. పోలీసు అధికారులు వాహన వేగం నియంత్రణకు చర్యలు చేపడతామని విన్నవించడంతో ఽప్రజలు ధర్నా విరమించారు. కాగా, ప్రభుత్వాస్పత్రి వద్ద మృతుల బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

Updated Date - Mar 07 , 2025 | 01:56 AM