శతకీర్తి..
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:18 AM
తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి వందవ రాకెట్ విజయవంతంగా రోదసిలోకి దూసుకుపోవడంతో షార్ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. ఒకప్పుడు బయటి ప్రపంచాన్ని ఎరుగని ఏనాదులు జీవించే ఒక మారుమూల దీవి, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా మారిన పరిణామాలను ఈ ప్రాంతపు వాసులు గుర్తు చేసుకుంటున్నారు.

షార్‌లో సంబరాలు
సూళ్లూరుపేట, జనవరి 29 (ఆంరఽధజ్యోతి):
తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి వందవ రాకెట్ విజయవంతంగా రోదసిలోకి దూసుకుపోవడంతో షార్ ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. ఒకప్పుడు బయటి ప్రపంచాన్ని ఎరుగని ఏనాదులు జీవించే ఒక మారుమూల దీవి, ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అంతరిక్ష ప్రయోగ కేంద్రంగా మారిన పరిణామాలను ఈ ప్రాంతపు వాసులు గుర్తు చేసుకుంటున్నారు. తొలి రోజుల్లో షార్ అభివృద్ధిలో భాగం అయిన శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగులు వందో విజయ సందర్భంలో సంబరపడుతున్నారు.
శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి బుధవారం ఉదయం 6.23 గంటలకు తెలిమంచు తెరలను చీల్చుకుంటూ జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోయింది. ఈ దృశ్యాన్ని ఈ ప్రాంత ప్రజలంతా ఇళ్ల బయటకు వచ్చి ఆనందంతో వీక్షించారు. పొగ చారలు ఆకాశంలో మిగిల్చి అంతరిక్షంలోకి నావిగేషన్ ఉపగ్రహం నావిక్-02 ను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి వందవ రాకెట్ చేర్చడంతో షార్ శాస్త్రవేత్తలు ఆలింగనాలూ, కరచాలనాలతో అభినందలు తెలుపుకున్నారు. ఈ విజయం షార్ భవిష్యత్తుకు కూడా కీలకం కానుంది. మూడవ లాంచ్ ప్యాడ్ నిర్మాణ నిర్ణయంతో, గత కొన్నేళ్లుగా స్తబ్దుగా మారిన శ్రీహరికోటలో మళ్లీ సందడి నెలకొననుంది. జీఎ్‌సఎల్వీ-ఎఫ్ 15 రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతాల నుంచి ఐదువేల మందిదాగా బుధవారం శ్రీహరికోటకు తరలివచ్చారు. మంచు కురుస్తున్నా చలిని సైతం లెక్కచేయకుండా గ్యాలరీలో కూర్చున్నారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. సూళ్లూరుపేట నుంచి శ్రీహరికోట వరకు వాహనాలు తెల్లవారుజామునుంచే బారులు తీరాయి. రాకెట్ నింగికి ఎగురుతున్న సమయంలో చప్పట్లు, ఈలలు, కేరింతలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
రాకెట్ వీక్షణకు మాజీ ఇస్రో చైర్మన్‌లు..
షార్ వేదికగా జరిగిన వందో రాకెట్ ప్రయోగ వీక్షణకు ఇస్రో మాజీ చైర్మన్లు డాక్టర్ ఎస్.సోమనాథ్, డాక్టర్ కె,రాధాకృష్ణ, శివన్, ఏఎ్‌స.కిరణ్ కుమార్ శ్రీహరికోటకు వచ్చారు. వీరితో పాటు పలువురు శాస్త్రవేత్తలు కూడా విచ్చేసి మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగాన్ని తిలకించారు. వందో ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో చైర్మన్ ప్రకటించగానే ఆనందోత్సాహాలు ప్రకటించారు.
విద్యార్థులతో కలిసి వీక్షించిన కలెక్టర్
రాకెట్ ప్రయోగాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ దంపతులు, ఆర్డీవో కిరణ్మయి మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి వీక్షించారు. సైన్సు ఫెయిర్‌లో ప్రతిభ కనబరిచిన సూళ్లూరుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్.హిమ, అన్షిని లకు కూడా కలెక్టర్‌తో పాటు మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించే అవకాశం కల్పించారు. ఈ సందర్బంగా శాస్త్రవేత్తలకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. సూళ్లూరుపేట పట్టణంలో ఉన్న 500 మంది విద్యార్థులకు రాకెట్ ప్రయోగాన్ని విజిటర్స్ గ్యాలరీ నుంచి వీక్షించే అవకాశం కలి ్పంచారు.