గ్రామాల్లో పరిశుభ్రత బాధ్యత కార్యదర్శులదే
ABN , Publish Date - Feb 16 , 2025 | 01:33 AM
ప్రభుత్వ కార్యాలయాల్లో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు
చిత్తూరు కలెక్టరేట్/నిండ్ర, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కొనసాగాయి. స్థానిక కలెక్టరేట్‌లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాలయ ఆవరణాలను శుభ్రపరిచి, సిబ్బందితో అధికారులు ప్రతిజ్ఞ చేయించారు.డీసీవో కార్యాలయంలో డీసీవో నాగవర్దన ప్రతిజ్ఞ చేయించి, ఆవరణాన్ని శుభ్రం చేయించారు. అదేవిధంగా స్కిల్ డెవల్‌పమెంట్, సెరికల్చర్ ఆఫీసు, డీఆర్డీఏ, డీఎంహెచ్‌వో కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం సాగింది. డీపీవో సుధాకర రావు నిండ్ర మండలంలోని శ్రీరామపురం పంచాయతీకి వెళ్లారు. సర్పంచ్ జయమ్మ అధ్యక్షతన సభ నిర్వహించారు.డివిజనల్ పంచాయితీ అధికారిణి పార్వతి, డీపీఆర్సీ షణ్ముగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీలో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి కార్యదర్శి క్షేత్రస్థాయిలో పారిశుధ్య లోపాన్ని గుర్తించి మెరుగు పరిచేందుకు అంకితభావంతో పనిచేయాలన్నారు.మండలంలోని అనేక పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగ్గా ఉండడంపై ఈవో పీఆర్డీ లక్ష్మీపతిని అభినందించారు.సాయంత్రం దాకా శ్రీరామపురం పేడదిబ్బలు తొలగించడం, ముళ్లకంపలు తొలగించడం, ఫాగింగ్ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివప్రసాద్ వర్మ, ఈవోపీఆర్‌డీ లక్ష్మీపతి, కార్యదర్శి ధరణి, ఎమ్మార్సీ అరుణాచలం తదితరులు పాల్గొన్నారు.