శంభోశంకరా...!
ABN , Publish Date - Feb 27 , 2025 | 12:52 AM
ఆదిదేవుడైన మహాశివుడికి ఇష్టమైన మహాశివరాత్రి వేడుకలను జిల్లావ్యాప్తంగా బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకాభిషేకాలు, విశేష పూజలతో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ‘హర హర మహాదేవ.. శంభో శంకర..’ అంటూ శివ నామస్మరణతో ఆలయాలు మార్మోగిపోయాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబుచేసిన శైవక్షేత్రాలన్నీ అశేష భక్తజనంతో కిటకిటలాడాయి.
బంగారుపాళ్యం,ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):బంగారుపాళ్యం మండలం మొగిలిలోని కామాక్షి సమేత మొగిలీశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. బుధవారం ఉదయం స్వామి,అమ్మవార్లను సుగంధభరితమైన పుష్పాలతో అలంకరించిఅభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.ఉమ్మడి చిత్తూరు జిల్లానుంచే కాక కర్ణాటక,తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తుల మొగిలి కిటకిటలాడింది. సాయంత్రం 3 గంటలకు కాణిపాక ఆలయం నుంచి ఈవో పెంచల కిషోర్‌తో కలసి ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.రాత్రి 12 గంటలకు లింగోద్భవ అభిషేక పూజలు ఘనంగా జరిగాయి. అనంతరం భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించారు. స్వామి,అమ్మవార్లు వృషభవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. ఈ పూజా కార్యక్రమాలకు మాజీ జమీందార్ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. కలెక్టర్ సుమిత్‌కుమార్,ఎస్పీ మణికంఠ కుటుంబసభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు.ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు.బంగారుపాళ్యంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం మొగిలి దేవస్థానం వరకు ఈశ్వర్ కళ్యాణ్ అభయం ట్రస్టు నిర్వాహకులు ఉచిత బస్సులను నడిపారు.కురప్పల్లికి చెందిన సుకుమార్, శ్రీని ఫుడ్ పార్క్ యాజమాన్యం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు.ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఎంబీ విజయకుమార్,చుడా ఛైర్‌పర్సన్ కఠారి హేమలత, మండల టీడీపీ అధ్యక్షుడు ఎన్పీ జయప్రకాష్, కాణిపాక ఆలయ మాజీ ఛైర్మన్ మణినాయుడు, ధరణీప్రసాద్ నాయుడు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ అధికారిణి సుమన్‌ప్రియ, అర్చకులు హరికేష్ గురుకుల్, మంజునాథ గురుకుల్,సోము గురుకుల్,దండపాణి గురుకుల్ పాల్గొన్నారు.బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం అభిషేకం,రావణబ్రహ్మ వాహన సేవ, రాత్రి శేషవాహన సేవ వుంటాయి.
జనసంద్రమైన కమ్మసంద్ర
వి.కోట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి):వి.కోటకు 18కిలోమీటర్ల దూరంలో వున్న కమ్మసంద్రలో వెలసిన కోటిలింగేశ్వరాలయం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం భక్తజనసంద్రంగా మారింది. ఆలయంలో వెలసిన కోటిలింగేశ్వరుడికి ఉదయాన్నే పలు రకాల అభిషేకాలు నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయం 10 గంటలకు 108 అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉత్సవమూర్తులను రథంలో కొలువుదీర్చి ఆలయమాడవీధుల్లో ఊరేగించారు. రథం ముందు కోలాటాలు, పండరి భజనలు, భక్తి గీతాలాపనలు, బాణసంచా వెలుగులు, మంగళవాయిద్యాలతో ఆ ప్రాంతం మార్మోగింది. రాత్రి జరిగిన స్వామివారి పల్లకి ఊరేగింపును చూసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో కేజీఎఫ్ మార్గం పూర్తిగా వాహనాలతో కిక్కిరిసిపోయింది.ఆలయ ఆవరణంలో ప్రతిష్టించిన వేలాది శివలింగాలకు భక్తులు పూజలు చేశారు. ఆలయ కమిటీ తరపున భక్తులకు తీర్థ, ప్రసాదాలను పంచిపెట్టారు.మహాశివలింగం వద్ద సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు జనం ఎగబడ్డారు.