Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి రూ.114.79 కోట్లు విడుదల
ABN , Publish Date - Oct 01 , 2025 | 01:30 AM
ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా మొదలు కానుంది.
చిత్తూరు సెంట్రల్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా మొదలు కానుంది. 2,68,770 మందికి అవసరమైన రూ.114.79 కోట్ల నిధులు జిల్లాకు వచ్చాయి. మంగళవారం సెలవు దినం కావడంతో గ్రామ, వార్డు ఉద్యోగులు సోమవారమే పింఛన్ మొత్తాలను బ్యాంకుల నుంచి డ్రా చేసి, పంపిణీకి సిద్ధంగా ఉంచుకున్నారు. బుధవారం ఉదయం 6.30 గంటల నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛను సొమ్ము అందజేయనున్నారు. ఈ మేరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషన్లకు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
నేడు యథావిధిగా పెన్షన్ల పంపిణీ
సచివాలయ ఉద్యోగులందరూ బుధవారం నుంచి పింఛన్ల పంపిణీలో పాల్గొంటారని, ఇందులో ఎటువంటి అవరోధాలు లేవని జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అధికారి రవికుమార్ తెలిపారు. సచివాలయ ఉద్యోగులు ఆందోళన కారణంగా సకాలంలో నగదు అందుతుందో లేదో అన్న సందిగ్ధత లబ్ధిదారుల్లో నెలకొందన్నారు. అయితే సచివాలయ సిబ్బంది అందరూ పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.
కలెక్టరేట్‌లో నేడు వ్యవసాయ యంత్రాల ప్రదర్శన
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించిన క్రమంలో రైతులకు ప్రయోజనకరంగా ఉండేందు కు బుధవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద వ్యవసాయ యం త్రాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.అదేవిధంగా శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. ఇవే కార్యక్రమాలు మండల కేంద్రాల్లోనూ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు.