Share News

ముసిలిపేడు వంతెనకు చేటు!

ABN , Publish Date - Feb 15 , 2025 | 01:38 AM

వాళ్ల కంటికి కనిపించేది ఇసుక.. దీని అక్రమ రవాణాతో వచ్చే డబ్బు మాత్రమే. ఈ క్రమంలో ఎవరికి.. దేనికి నష్టం వాటిల్లినా పట్టించుకోవడం లేదు. ఇలా.. ఇసుకాసురులు ముసిలిపేడు వద్ద స్వర్ణముఖి నది వంతెన కిందా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు.

ముసిలిపేడు వంతెనకు చేటు!
స్వర్ణముఖి నది వంతెన పక్కనే విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

యథేచ్ఛగా స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలు

వాళ్ల కంటికి కనిపించేది ఇసుక.. దీని అక్రమ రవాణాతో వచ్చే డబ్బు మాత్రమే. ఈ క్రమంలో ఎవరికి.. దేనికి నష్టం వాటిల్లినా పట్టించుకోవడం లేదు. ఇలా.. ఇసుకాసురులు ముసిలిపేడు వద్ద స్వర్ణముఖి నది వంతెన కిందా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. దీనివల్ల వంతెన దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన.. అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా లెక్క చేయడంలేదు.

- శ్రీకాళహస్తి, ఆంధ్రజ్యోతి

ఏర్పేడు మండలం ముసిలిపేడు వద్ద స్వర్ణముఖి నదిపై భారీ వంతెన ఉంది. శ్రీకాళహస్తి మండలం తొండమనాడు నుంచి ముసిలిపేడు మీదుగా పాపానాయుడుపేట వరకు సుమారు 100 గ్రామాలకు ఇదే ప్రధాన మార్గం. ఈ వంతెన సమీపంలో శ్మశానమూ ఉంది. గత వైసీపీ పాలనలో ఈ వంతెన సమీపంలో ఇష్టారాజ్యంగా అక్రమార్కులు ఇసుక తవ్వకాలను సాగించారు. రాత్రి వేళల్లో నదిలోకి దిగి ఇసుక తవ్వి బయట ప్రాంతాలకు తరలించారు. దీంతో స్థానిక రైతులు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయంటూ గగ్గోలు పెట్టారు. అలాగే వంతెన సమీపంలో ఇసుక తవ్వకాలు జరిగితే పెనుముప్పు సంభవిస్తుందన్న ఆవేదనతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో రెండేళ్ల క్రితం ముసిలిపేడు వంతెనకు ఇరువైపులా 500 మీటర్ల మేర ఎక్కడ ఇసుక తవ్వకాలు జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. దీంతో స్థానికులు అప్పటినుంచి తరచూ ఇసుక తవ్వకాలను అడ్డుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇసుక తవ్వకాలు జరగకుండా వైసీపీకి చెందిన ఇసుకాసురులను ముసిలిపేడు వద్ద తరిమికొట్టారు. 5 నెలల క్రితం మళ్లీ వంతెన సమీపంలో తవ్వకాలు ఆరంభం కావడంతో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో కొంత కాలం పాటు వంతెన వద్ద ఇసుక తవ్వకాలు ఆగాయి. మళ్లీ నెల రోజులుగా వంతెన పక్కనే ఉన్న బాట నుంచి నదిలోకి ట్రాక్టర్లు దిగి ఇసుక తరలించడం ప్రారంభమైంది. గతంలో రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా తవ్వేవారు. ప్రస్తుతం పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఎంతో ధీమాగా.. వంతెన కిందనే తవ్వకాలు సాగిస్తున్నారు. పగటిపూట మనుషులతో, రాత్రిపూట యంత్రాలతో తోడేస్తున్నారు. ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి, చంద్రగిరి, చెన్నైలకు భారీ ఎత్తున ఇసుక తరలిస్తున్నారు. ఈ నిర్లక్ష్య వైఖరి మరికొద్ది రోజులు పాటు కొనసాగితే వంతెనకు చేటు తప్పదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ వంతెనకే దిక్కులేదు

ఏర్పేడు మండలం పాపానాయుడు పేట వద్ద స్వర్ణముఖి నదిపై ఓ వంతెన మూడేళ్ల క్రితం వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. ఇప్పటికీ అక్కడ కొత్త నిర్మాణానికి అడుగు పడలేదు. ముసిలిపేడు వద్ద ఉన్న కీలకమైన వంతెన దెబ్బతింటే వంద గ్రామాలకు రాకపోకలు ఇబ్బందిగా మారతాయి. ఇక, పరివాహ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతాయని రైతులూ ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు అక్రమ ఇసుక తవ్వకాలను అరికట్టడంతో పాటు వంతెనకు భద్రత కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Feb 15 , 2025 | 01:38 AM