ఎస్‌ఆర్‌పురంలో ‘క్వారీ’లాట
ABN , Publish Date - Jan 22 , 2025 | 01:38 AM
శ్రీరంగరాజపురం మండలం ఆర్‌ఆర్‌పురం సమీపంలో సుమారు మూడు ఎకరాల గ్రానైట్ క్వారీ వివాదాలకు కేంద్రంగా మారింది.
శ్రీరంగరాజపురం, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): శ్రీరంగరాజపురం మండలం ఆర్‌ఆర్‌పురం సమీపంలో సుమారు మూడు ఎకరాల గ్రానైట్ క్వారీ వివాదాలకు కేంద్రంగా మారింది. మంగళవారం ఆ క్వారీ తమదంటే తమదని వాగ్వాదాలు నడిచాయి. కొంత కాలంగా ఈ క్వారీలో చిత్తూరుకు చెందిన శేఖర్‌బాబు పనులు చేసుకుంటున్నారు. మంగళవారం తమిళనాడుకు చెందిన భానుప్రతాప్ అనే వ్యక్తి క్వారీ వద్దకు వచ్చి ‘ఇది నా క్వారీ. వెంటనే పనులు నిలిపివేయండి’ అంటూ ప్రెస్‌మీట్ పెట్టారు. అదే మండలం పిల్లిగుండ్లపల్లెకు చెందిన గుణశేఖర్‌నాయుడు కూడా అక్కడి వచ్చి.. ‘ఇక్కడే ఆనుకుని మా భూమి కూడా ఉంది. సర్వే తర్వాత పనులు చేసుకోండి’ అన్నారు. ముగ్గురి మధ్య వాదోపవాదాలు జరిగాయి. పోలీసులు కల్పించుకుని ముగ్గుర్నీ స్టేషన్‌కు పిలుచుకుని వెళ్లారు. సరైన రికార్డులు తెచ్చినవారు క్వారీ పనులు చేసుకోవాలని సూచించారు. తాత్కాలికంగా క్వారీలో పనుల్ని నిలిపేశారు.ఇదిలా ఉండగా, 2017లో భానుప్రతాప్ తండ్రి మణినాయుడు ఈ క్వారీకి ఎన్‌వోసీ తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో మణినాయుడు మరణించగా.. 2019లో పెద్దఎత్తున ఫైన్ వేసి అధికారులు మూసేశారు. కొంత కాలంగా శేఖర్‌బాబు ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. క్వారీ నుంచి గ్రానైట్ దిమ్మెలు తరలిస్తుండడంతో మంగళవారం భానుప్రతాప్ అడ్డుకున్నారు.